
ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం
–నవంబర్ 1 నుంచి జనవరి 16 వరకు తరగతులు ఉండవు
–సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు విద్యార్థులకు సెలవులు
యూనవర్సిటీక్యాంపస్ (తిరుపతి):
ఎస్వీయూనివర్సిటీలో అధికారులు వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు. రెండున్నర నెలల పాటు తరగతులు రద్దు చేసి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 3 నుంచి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో 75 రోజుల పాటు తరగతులు రద్దుచేశారు. నవంబర్ 1 నుంచి జనవరి 16 వరకు తరగతులు రద్దు చేయనున్నారు. ఎస్వీయూలో జనవరిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఏర్పాట్లపై గురువారం అధికారులు క్యాంపస్‌లోని భవనాలు, వసతి గృహాలను పరిశీలించారు. అనంతరం సాయంత్రం వీసీ దామోదరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో రెక్టార్ భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పరీక్షల నియంత్రణాధికారి, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎస్వీయూ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తుండటం, ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు, ప్రముఖలకు ఎస్వీయూలో వసతి, భోజనం, ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. అంతే కాకుండా 30 సెమినార్ హాళ్లు అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలంటే వసతి గృహాలు, తరగతి గదుల ఆధునికీకరణ, భవనాలకు రంగులు, విద్యుత్ రిపేర్లు, రోడ్ల నిర్మాణం, చెట్ల పెంపకం చేపట్టాల్సి ఉంది. భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏర్పాట్లపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ టక్కర్ అధికారులతో సమీక్ష చేశారు. డిసెంబర్ 15 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని టక్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీసీ గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 లోపు మొదటి, మూడవ సెమిస్టర్ సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో తిరిగి తరగతులు పునః ప్రారంభిస్తామని ఎస్వీయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఆర్.అబ్బయ్య, మునిరత్నం, భగవాన్ రెడ్డి, మల్లికార్జున, పరీక్షల నియంత్రణాధికారి చంద్రయ్య, పరీక్షల ప్రత్యేకాధికారి సుబ్రమణ్యం నాయుడు పాల్గొన్నారు.
ఇదే మొదటి సారి:
ఎస్వీయూ రెండున్నర నెలల పాటు తరగతులు రద్దు చేసి సెలవులు ప్రకటించటం ఇదే తొలిసారని కొందరు రిటైర్డ్ అధ్యాపకులు పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను చూసే అదృష్టాన్ని విద్యార్థులు కొల్పోతారని అన్నారు. అంతే కాకుండా దీనివల్ల వారి చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు. అధికారుల ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.