జలకళ
– నిండుకుండలా శ్రీశైలం డ్యాం
– 12 రోజుల్లో 52 టీయంసీల నీరు చేరిక
– 882 అడుగులకు చేరిన నీటి మట్టం
– 28న గేట్లు ఎత్తేందుకు యత్నాలు
కర్నూలు సిటీ: కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాం గరిష్ట నీటిమట్టానికి చేరువగా ఉంది. ఈ నెల 15వ తేదీన 870.20 అడుగులు, 142.71 టీయంసీల నీరు ఉండగా సోమవారం రాత్రి నాటికి 882 అడుగులు, 194 టీయంసీలకు చేరుకుంది. భారీ వర్షాలతో 12 రోజుల్లోనే 52 టీఎంసీల నీరు చేరింది. ఈ నెల 28వ తేదీన రేడియల్ క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేసేందుకు డ్యాం ఇంజినీర్లు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి శ్రీశైలంలో డ్యాం ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి, ఈఈలు, డీఈఈ, ఏఈఈలతో కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ నారాయణరెడ్డి సమావేశమై చర్చించారు.
పూర్థి సామర్థ్యానికి చేరువలో..
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి సామర్థ్యం 305 టీయంసీలు. డ్యాంలోకి పూడిక చేరడంతో సామర్థ్యం 215 టీఎంసీలకు తగ్గిపోయింది. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో 17.20 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో సుమారు 170 టీయంసీల నీరు డ్యాంలోకి వచ్చింది. ఇందులో 50 టీఎంసీలు పైగా దిగువకు వదిలారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో ఇలా కొనసాగితే 12 గంటలోన్లే డ్యాం నిండుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు 77 వేల క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. రెండు, మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని మహబలేశ్వరంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్‌ఫ్లోకు మరింత వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నాం
– మల్లికార్జునరెడ్డి, శ్రీశైలం డ్యాం ఎస్‌ఈ
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. డ్యాంలో 195 టీయంసీల నీరు చేరుకున్నాక గేట్లు ఎత్తేందుకు సిద్ధం అవుతున్నాం. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు హాజరు అయ్యే అవకాశం ఉంది. సీఈతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటాం.