
త్వరలో రైతులకు 9 గంటల విద్యుత్
విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సదరన్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ జిల్లా సౌత్ సర్కిల్ ఎస్‌ఈ శ్రీ రాములు అన్నారు. వికారాబాద్ సబ్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన హరితహారంలో ఆయన మొక్కలు నాటారు.
మెరుగైన విద్యుత్ సేవలే లక్ష్యంగా కృషి
ఎన్‌పీడీసీటీఎల్ ఎస్‌ఈ శ్రీరాములు
వికారాబాద్ రూరల్ : విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సదరన్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ జిల్లా సౌత్ సర్కిల్ ఎస్‌ఈ శ్రీ రాములు అన్నారు. వికారాబాద్ సబ్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన హరితహారంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అందజేస్తామన్నారు. మే నెలలో వర్షాలు, గాలి వానలకు కూలిన స్తంభాల స్థానంలో ఐదు వేల స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ సరఫరాలో జరిగే సమస్యలను వినియోగదారులకు ఎక్కువ ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సబ్‌స్టేషన్లలో ఆపరేటర్ల నియామకం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేటర్లుగా దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ చదివి, తప్పనిసరిగా విద్యుత్ స్తంభం ఎక్కాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా సర్కిల్ పరిధిలో 10 వేల మొక్కలు నాటాలన్న లక్ష్యం నిర్ధేంచగా వికారాబాద్ డివిజన్‌లో ఆరు వేలు, రాజేంద్రనగర్, చంపాపేట పరిధిలో రెండేసి వేల చొప్పున మొక్కలు నాటుతున్నామన్నారు. ఇప్పటికే వికారాబాద్ డివిజన్‌లో ఏడు వేల మొక్కలు నాటామన్నారు. నాటిన మొక్కల్లో ఆయుర్వేదం, పువ్వులు, పండ్ల మొక్కలు అధికంగా ఉన్నాయన్నారు. విద్యుత్ పరమైన పనులు పురోగతిలో, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో వికారాబాద్ మిగితా డివిజన్ల కంటే ముందుందని అభినందించారు. కార్యక్రమంలో డీఈ దుర్గారావు, యూనియన్ నాయకుడు నీలకంఠరావు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.