ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరావు
గుడ్లవల్లేరు (గుడివాడ) : ఈ ఖరీఫ్‌లో సాగునీటికి కరువు లేనట్లేనని ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరావు అన్నారు. ఆయన పల్లెనిద్ర కోసం సోమవారం కౌతవరం ఇరిగేషన్ బంగళాకు వచ్చారు. బంటుమిల్లి కాలువ నుంచి విడుదలవుతున్న సాగునీటిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునేరు నుంచి 8వేల క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు తెలిపారు. కట్టలేరు, వైరా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కీసరకు 11వేల క్యూసెక్కుల నీరు చేరిందని పేర్కొన్నారు.
పట్టిసీమ నుంచి 7,200 క్యూసెక్కులు విడుదలైనట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 98 టీఎంసీల నీరు విడుదలైందని, త్వరలోనే 100 టీఎంసీలకు చేరుతుందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజీ వద్ద 11.7 అడుగుల నీటి మట్టం నమోదైనట్లు వివరించారు. తమ పరిధిలోని 5.67లక్షల హెక్టార్లకు, 4.28 లక్షల్లో వరి సాగు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీలోపు వరినాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా పులిచింతలలో 3.7టీఎంసీలను నిల్వ ఉంచినట్లు వివరించారు. డ్రెయినేజీ ఈఈ చంద్రశేఖర నాయుడు, ఇరిగేషన్ ఏఈ సిద్ధార్థ, లాకు సూపరింటెండెంట్ ఉదయభాస్కర్ పాల్గొన్నారు.