కష్టమే.. ఆ కార్మికుడి చుట్టం!
- నిత్యం వెన్నంటే కష్టాలు ∙అనారోగ్యంతో కుదేలైన జీవితం
- వెన్నుపూసపై కణితి తొలగించే ఆపరేషన్‌తో మంచం పట్టిన వైనం
- ఇదీ.. చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే ఓ కార్మికుడి కన్నీటి వ్యథ
టెక్కలి : తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ చెప్పులు కుట్టుకునే వృత్తినే నమ్ముకున్నాడు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుని వచ్చాడు. అదే వృత్తిలో ఉంటూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి వివాహం చేశాడు. ఉన్న దాంతో తృప్తి పడుతూ.. జీవితం గడుపుతున్న సమయంలో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అక్కడకు కొద్ది రోజుల్లోనే చిన్న కుమారుడికి పక్షవాతం వచ్చింది. వీటికి తోడుగా అతని వెన్నుపూసపై కణితి ఏర్పడింది. దానిని తొలగించే ఆపరేషన్ చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆపరేషన్ తరువాత ఆ కార్మికుడు మంచానికే పరిమితమైపోయాడు. సాఫీగా సాగిపోతున్న ఆ కార్మికుడి జీవితం అల్లకల్లోలంగా మారింది. మేడే.. ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ రోజున ఓ కార్మికుడి దీనగాథ తెలుసుకుందాం.
టెక్కలి రామదాసుపేటవీధికి చెందిన కటారి అప్పారావు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అయితే 2014 సంవత్సరంలో అతని భార్య సుశీల హఠాత్తుగా మరణించింది. అక్కడకు ఆరు నెలల తరువాత చిన్న కుమారుడు సత్యనారాయణకు పక్షవాతం వచ్చింది. చెప్పులు కుట్టుకుంటే వచ్చిన డబ్బులతోపాటు.. చుట్టుపక్కల వారి దగ్గర అప్పులు చేసి మరీ అప్పారావు తన చిన్న కుమారుడికి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందజేశాడు. ఇలా అప్పులు చేసి వైద్యం అందజేస్తున్న సమయంలో.. అప్పారావు వెన్నుపూసపై కణితి ఏర్పడింది. రాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని స్థానికులు చెప్పడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అప్పారావు ఆపరేషన్ చేయించుకున్నాడు.
అంతే.. ఆ తరువాత అప్పారావు మంచం పట్టాడు. నెలలు గడుస్తున్నప్పటికీ కోలుకోవడం లేదు. పెద్ద కుమారుడు నారాయణరావుకు వివాహం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన కూడా చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం తండ్రి, సోదరుడి భారం నారాయణరావుపై పడింది. ప్రభుత్వం దృష్టిలో ‘ముచ్చి’ (ఎస్సీ) కులంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఏనాడూ తమను ఆర్థికంగా ఆదుకునే సాయం లేదంటూ ఆ కుటుంబం వాపోయింది. చేతి వృత్తి కార్మికులకు అందజేసే కనీస సంక్షేమ పథకాలు కూడా ఏనాడూ తాము అందుకోలేదని.. మంచం పట్టిన అప్పారావు భోరున విలపించాడు. తనతోపాటు చిన్న కుమారుడి వైద్యం కోసం ప్రభుత్వంతోపాటు దాతలు దయ చూపాలని వేడుకుంటున్నాడు.