బలహీనపడ్డ వాయుగుండం
Published Fri, Aug 12 2016 12:04 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలహీనపడింది. గురువారం రాత్రికి వాయుగుండంగా బలహీనపడి జార్ఖండ్‌లోని రాంచీకి 200 కి .మీ. ఈశాన్యంగాను, బీహార్‌లోని గయకు తూర్పు ఈశాన్య దిశగా 220 కి.మీల దూరంలోనూ కేంద్రీకతమై ఉంది. శుక్రవారం నాటికి ఇది మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ గురువారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అలాగే ఈ నెల 16న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రసుత్తం రాష్ట్రంపైకి పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీంతో ఆకాశంలో మేఘాలు ఏర్పడడం లేదు. ఫలితంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం నేరుగా పడుతోంది. దీని ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేదాకా ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Advertisement