
ఇక ఆధార్ ఆధారిత చెల్లింపులు
రేషన్ డీలర్లు తప్పనిసరి అమలు చేయాలి
రెండు వారాల్లోగా అన్ని బ్యాంకులకు యాప్ సౌకర్యం
సదస్సులో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
పరకాల : ప్రస్తుతం ఏపీజీవీ బ్యాంకు ద్వారా జరుగుతున్న ఆధార్ ఆధారిత చెల్లింపులను రెండు వారాల్లో మిగతా బ్యాంకులకు వర్తింపజేస్తామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల చెల్లింపులు సులువవుతాయని, వ్యాపారాలు సజావుగా సాగుతాయని ఆయన పేర్కొన్నారు. పరకాలలోని మయూరి గార్డెన్స్‌లో వరంగల్ రూరల్‌ఆర్‌డీఓ మహేందర్‌జీ అధ్యక్షతన గురువారం ‘నగదు రహిత లావాదేవీలు – ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ’పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ హాజరై ఆధార్ ఆధారిత చెల్లింపుల యాప్ వివరాల ను వెల్లడించారు. స్వైపింగ్ యంత్రాల కొరత కారణంగా ఏపీజీవీబీ ఖాతాలు ఉన్న వ్యాపారస్తులు ఆధార్ ఆధారిత చెల్లింపుల యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు రూ.2వేలు వెచ్చించి యంత్రం కొనుగోలు చేస్తే నగదు చెల్లిం పులు సులువవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు రేషన్ డీలర్లు కూడా యాప్ ద్వారా లావాదేవీలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయాల్లో రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, ఆ నగదును తిరిగి వారి డిపాజిట్‌లో జమ చేస్తామని వెల్లడించారు. అయితే, పలువురు తమకు ఏపీజీవీబీల్లో ఖాతాలు లేవని చెప్పడంతో రెండు వారాల్లోగా మిగతా బ్యాంకుల ద్వారా కూడా ఆధార్ ఆధారిత చెల్లింపులు జరిగేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా స్వైపింగ్ యంత్రాలు ఇవ్వడం లేదని చెప్పగా ఆధార్ ఆధారిత లావాదేవీ లకు అలవాటైతే అన్ని సమస్యలు తీరుతాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు.
వేలిముద్ర, ఆధార్ నంబర్..
ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం యంత్రాలు ఉపయోగించే సమయంలో వినియోగదారుడి వేలిముద్ర, ఆధార్ కార్డు నెంబర్ యాప్‌లో నమోదు చేస్తే సరిపోతుందని కలెక్టర్ పాటిల్ తెలిపారు. ఆధార్ నంబర్ నమోదు చేయగానే బ్యాంకు అకౌంట్ నంబర్ కనిపిస్తుందని.. దీంతో నగదు చెల్లింపు సు లువవుతుందని పేర్కొన్నారు. ఇక కరెంట్ అకౌంట్ లేని వ్యాపారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ మేనేజర్లను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ జనరల్ మేనేజర్ రవికిరణ్, రీజినల్ మేనేజర్ విశ్వప్రసాద్, టెక్నికల్ చీఫ్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌బీఐ మేనేజర్ ఆర్.శేషగిరి, ఎస్‌బీహెచ్ జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి, మేనేజర్ మురళీకృష్ణ, జెడ్పీటీసీ పి.కల్పనాదేవి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ కుమారస్వామి, కమిషనర్ ఆర్.పరమేశ్ పాల్గొన్నారు.