నెల్లూరు: నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలిగించారన్న మనస్తాపంతో మహిళా ఉద్యోగి సుమలత సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఆనంద్, సుమలత(32) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆనంద్‌కు రెండు కిడ్నీలు ఫెయిలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కాగా, హేమలత ఆరోగ్యమిత్ర కార్యకర్తగా పనిచేస్తూ కుటుంబపోషణ భారాన్ని మోస్తోంది. ఇటీవల ఆరోగ్యమిత్రలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితుల్లో సుమలత తీవ్ర మనస్థాపానికి గురై ఉదయం ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.