మహిళ ఆత్మహత్యాయత్నం
-
కాపాడాలని మీడియాను ఆశ్రయించిన వైనం
-
పోలీసుల సహకారంతో చికిత్స
నెల్లూరు (క్రైమ్) : తనను తల్లిదండ్రులు నిర్బంధించి హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ బ్లేడుతో చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను నిర్బంధం నుంచి రక్షించాలని మీడియాను ఆశ్రయించింది. రెండోనగర పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరంలోని కొండాయపాళెంలో నివాసముంటున్న ఓ విశ్రాంత డీఎస్పీకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మధురిమకు 2009లో తల్లిదండ్రులు ఓ ఎన్నారైతో వివాహం జరిపించారు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు రావడంతో భర్త ఆమెను వదిలివేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మానసిక సంఘర్షణతో మతిస్థిమితం కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను పలు హాస్పిటల్స్‌లో చికిత్స చేయించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడలేదు. ఆమె ప్రవర్తనతో తల్లిదండ్రులు సైతం విసిగి పట్టించుకోవడం మానివేశారు. ఈ నెల 6వ తేదీ ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. మధురిమ పరిస్థితి తెలుసుకున్న చర్చి నిర్వాహకురాలు ప్రసన్న మధురిమ ఆరోగ్యం కుదుటపడే వరకు తనవద్ద ఉంచుకొని ప్రార్థన చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు ఆమెను ప్రసన్న వెంట చర్చికి పంపారు. నాలుగు రోజులుగా మధురిమ చర్చికి సంబంధించిన ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం మధురిమ జడ పిన్నుతో ఎడమ చేతిపై కోసుకోవడంతో పాటు గాయాలతో ఉన్న ఫొటోలను ఆమె వాట్సప్‌లో మీడియా ప్రతినిధులకు పంపింది. తాను చర్చిలో ఉన్నానని, తల్లిదండ్రులు తనను నిర్బంధించారని, రక్షించాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని మెసేజ్‌లను పంపింది. బాధితురాలి మెసేజ్‌లు, ఫొటోలను మీడియా ప్రతినిధులు రెండో నగర పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రెండో నగర ఎస్‌ఐలు వి. శ్రీహరి, తిరుపతయ్య స్పందించి చర్చిలో ఉన్న మధురిమను గుర్తించారు. ఆమె ఎడమ చేతికి తీవ్రగాయాలై ఉంటడంతో చికిత్స చేయించారు. చర్చి నిర్వాహకులు, స్థానికులను విచారించారు. మధురిమ కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా బాధపడుతోందని, తరచూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతోందని చెప్పారు.