ఆబ్కారీ.. కొత్త స్వారీ! | Abkari new riding for developing the two districts | Sakshi
Sakshi News home page

ఆబ్కారీ.. కొత్త స్వారీ!

Published Tue, May 23 2017 6:08 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

ఆబ్కారీ.. కొత్త స్వారీ! - Sakshi

ఆబ్కారీ.. కొత్త స్వారీ!

► పోలీసు జీపులకు సైరన్‌ యూనిఫామ్‌లోనే దాడులు
►గ్రామాల్లో అవగాహసదస్సులు
►కొత్త విధివిధానాలు ఖరారు
►జూన్ 2నాటికి సారారహిత జిల్లాలుగా మార్చేందుకు ప్రణాళికలు



మహబూబ్‌నగర్‌ క్రైం: సారాతయారు విధానంపై మరోసారి ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. వందశాతం సారారహిత జిల్లాగా ప్రకటించాలని ఆబ్కారీశాఖ కఠినమైన కొత్త విధివిధానాలు ఖరారుచేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అకూన్ సబర్వాల్‌ ఆ శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించడమే కాకుండా కఠినమైన నిర్ణయాలతో కూడిన ఆదేశాలు జారీచేశారు. నిర్ధేశించిన లక్ష్యం కళ్లెదుట ఉండటంతో ఆబ్కారీశాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడిజిల్లాలో సంబంధితశాఖ అధికారులు సారా నియంత్రణపై ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
 
సారారహిత జిల్లాలే లక్ష్యం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి సంపూర్ణ సారారహిత రాష్టంగా ప్రకటించేందుకు కసరత్తు చేయాలని అధికారులను అకూన్ సబర్వాల్‌ ఆదేశించారు. ఈ నెల 28నాటికి నాలుగు జిల్లాల్లో సారారహితంగా ప్రకటించాక రాష్ట్రస్థాయి అధికారిక బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటించి ధ్రువీకరిస్తారని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తే జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకల్లో çస్వయంగా సీఏం నివేదిక ప్రకటిస్తారని పేర్కొంటూ దీని అమలుకు కఠినమైన నిర్ణయాలు జారీ చేశారు. అయితే గతేడాది జిల్లాల విభజన తర్వాత మూడునెలల్లో సారా కేసుల పరంపర ఒక్కసారిగా పెరిగింది. నెలరోజులుగా నల్లబెల్లం విక్రయాలు జోరందుకున్నాయి.

అక్రమ రవాణా పెరిగింది. ఇటీవల ఆబ్కారీశాఖ అధికారులు తనిఖీలు చేయడానికి గ్రామాల్లోకి వెళ్లగా సివిల్‌డ్రస్‌లో ఉండటంతో ప్రజలనుంచి వ్యతిరేకత వచ్చింది. ఖిల్లాఘణపురంలో కల్తీకల్లు అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకుని రైడ్‌కు వెళ్లిన ఎక్సైజ్‌ఎస్‌ఐపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనల నుంచి బయటపడాలంటే డ్రస్‌ ధరించే తనిఖీలు చేయడానికి వెళ్లాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ అధికారుల వాహనాలపై ఆబ్కారీశాఖ లోగోతో పాటు పోలీస్‌ తరహా సైరన్లు పెట్టనున్నారు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్ల వెంట ఉండే ప్రహరీలపై, ప్రభుత్వ కార్యాలయాలపై ‘కల్తీకల్లు, నాటుసారా తరిమివేద్దాం.. బంగారు తెలంగాణను నిర్మిద్దాం’ వంటి నినాదాలను రాయిస్తున్నారు.
 
రెండు జిల్లాల్లో అధికం

నూతనంగా ఏర్పడిన వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సారా తయారీ అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మండలాల్లో ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తున్నట్లు తేల్చారు. ఈ రెండు నెలలలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 54కేసులు నమోదుకాగా 52మందిని అదుపులో తీసేకున్నారు. 350లీటర్ల సారా సీజ్‌ చేయడంతో పాటు 8వేల లీటర్ల బెల్లం పానకం దొరికింది. ఉమ్మడి జిల్లాలో 1365కిలోల బెల్లం సీజ్‌ చేయగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే 1236కేజీల బెల్లం సీజ్‌ చేశారు. వనపర్తి జిల్లాలో  రెండు నెలల నుంచి 25కేసులు నమోదు చేయగా 30మందిని అదుపులో తీసుకున్నారు. 120లీటర్ల సారా సీజ్‌ చేయడంతో పాటు 6వేల బెల్లం పానం పారబోశారు.
కఠిన ఆదేశాలు ఇలా..

ఆబ్కారీశాఖ యూనిఫాంలోనే సిబ్బంది దాడులు చేయాలి.
ఈ నెల చివరినాటికి అన్ని స్టేషన్ల జీపులకు సైరన్ పెట్టి సమాచారం అందించాలి.
రాజకీయ ప్రమేయం రానివ్వకూడదు. ఒకవేళ ఎవరైనా తారాస్థాయి ఒత్తిడి తెస్తే వారి పేర్లను తెలియజేయాలి.
సారా కేసుల్లో బైండోవర్‌ నమోదయ్యాక కూడా సారా అమ్మి పట్టుబడితే వారి నుంచి రూ.1లక్ష జరిమానా, జైలు శిక్షకు పంపించాలి.
సారా కేసుల్లో స్టేషన్ బెయిల్‌ ఇచ్చే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలి. తప్పనిసరిగా కోర్టుకు రిమాండ్‌ చేయాల్సిందే.
రాష్ట్రస్థాయిలో ఆబ్కారీస్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష తర్వాత వాట్సాప్‌ గ్రూప్‌ రూపొందించారు. రోజు వారీ కార్యకలాపాలను పొందుపరచాలి.
మద్యం ధరల ఎమ్మార్పీ ఉల్లంఘన, నల్లబెల్లం అమ్మకాలు, మద్యం కల్తీ, పర్మిట్‌రూం, బయట మద్యం తాగితే కేసుల నమోదును వేగంగా చేపట్టాలి.
అవసరమైన పక్షంలో సారా, బెల్లం దారులపై పీడీయాక్టు నమోదు చేయాలి.
గతేడాది నుంచి నమోదైన కేసులు 1989, అరెస్టు అయిన వారు 2199, సీజ్‌ చేసిన వాహనాలు152, స్వాధీనం చేసుకున్న సారా 10వేల లీటర్లు, పారబోసిన బెల్లం పానకం 50వేల లీటర్లు, సీజ్‌ చేసిన బెల్లం 88,561కేజీలు.

ప్రతి గ్రామంలో పోస్టర్లు
సారారహిత జిల్లాగా మార్పులో భాగంగా ప్రతి గ్రామంలో పోస్టర్లు, ప్రహరీలపై స్లోగమ్స్ రాయించాం. అదేవిధంగా ప్రతి సర్పంచ్‌కు లేఖలు రాశాము. జూన్ 2నాటికి ఉమ్మడి జిల్లాలో సారా లేకుండా చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో అధికంగా ఉంది దానిపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు తనిఖీలు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
                                  – జయసేనరెడ్డి, అబ్కారీశాఖ డీసీ, మహబూబ్‌నగర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement