వరంగల్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ప్రభుత్వోద్యోగి ఇమ్మానియల్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. హైదరాబాద్ కూకట్‌పల్లి పట్టణ ప్రణాళిక విభాగంలో పర్యవేక్షణాధికారిగా ఇమ్మానియల్ పనిచేస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌లో నివాసముంటున్న ఇమ్మానియల్ గతంలో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ బృందం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాయిబాబాతో కలిసి ఇమ్మానియల్ ఇంటిపై దాడి చేసి రూ. 4 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
భవానీనగర్‌లోని ఇల్లు, పక్కనే 800 గజాలలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్, హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్, కాజీపేటలో ఒక ఇల్లు, హసన్‌పర్తి మండలంలో 4 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, రూ.30 వేల నగదు, 20 తులాల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, క్రెడిట్‌కార్డులు, ఏటీఎంకార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ అకౌంట్లను తెలుసుకోవాల్సి ఉంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.