ఏసీబీ వలలో జిల్లా ఆడిట్‌ అధికారులు | ACB raids Audit office | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో జిల్లా ఆడిట్‌ అధికారులు

Published Sat, Jul 30 2016 8:50 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో జిల్లా ఆడిట్‌ అధికారులు - Sakshi

ఏసీబీ వలలో జిల్లా ఆడిట్‌ అధికారులు

  •  పెన్షన్‌ మంజూరుకు లంచం డిమాండ్‌
  •  రూ.30 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం 
  •  
    నెల్లూరు (క్రైమ్‌) : 
    ఓ యువతికి ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఆడిట్‌ అధికారి షణ్ముఖరెడ్డి, సీనియర్‌ ఆడిటర్‌ వాహీద్‌బాషా ఏసీబీ అధికారులకు శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీస్పీ తోట ప్రభాకర్‌ సమాచారం మేరకు.. బూడిద వెంకటసుబ్బయ్య, లీలావతమ్మ దంపతులు. వీరికి శ్రీనివాసులు, సుభాషిణి, పద్మావతి పిల్లలు. వెంకటసుబ్బయ్య ట్రెజరీలో పని చేస్తూ మృతి చెందాడు. దీంతో తండ్రి ఉద్యోగం శ్రీనివాసులుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన పొదలకూరు సబ్‌ట్రెజరీ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తూ మూలాపేట కోనేటిమిట్టలో నివాసముంటున్నారు. ఓ కుమార్తె సుభాషిణికి వివాహం కాగా, మరో కుమార్తె పద్మావతికి వివాహం కావాల్సి ఉంది. వెంకటసుబ్బయ్య మృతి చెందిన అనంతరం పెన్షన్‌ లీలావతమ్మకు వచ్చేది. ఆమె సైతం 2013 నవంబర్‌లో మృతి చెందింది. తల్లిదండ్రులు మరణించిన సమయంలో వారి పెన్షన్‌ పెళ్లి కాని, వితంతువు, వికలాంగురాలైన పిల్లలకు వస్తుంది. దీంతో అవివాహితురాలైన పద్మావతికి పెన్షన్, అరియర్స్‌ మంజూరు చేయాలని ఆమె అన్న శ్రీనివాసులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వారు రికార్డులన్నింటిని పరిశీలించి జిల్లా ఆడిట్‌ అధికారి (స్టేట్‌ ఆడిట్‌) రాష్ట్ర  కార్యాలయానికి పంపారు. 
    రూ.లక్ష లంచం డిమాండ్‌
    ఆడిట్‌ కార్యాలయంలోని సీనియర్‌ ఆడిటర్‌ నరేష్‌ పెన్షన్‌ మంజూరు చేయకుండా రిమార్కులున్నాయంటూ శ్రీనివాసులను తిప్పుకుంటూ వచ్చారు. పని కావాలంటే రూ. లక్ష డిమాండ్‌ చేశారు. ఇటీవల అతను సెలవుపై వెళ్లడంతో సీనియర్‌ ఆడిటర్‌ వహీద్‌బాషా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసులు అతన్ని కలవగా జిల్లా ఆడిట్‌ అధికారికి చెప్పమన్నారు. శ్రీనివాసులు జిల్లా ఆడిట్‌ అధికారి ఎన్‌. షణ్ముఖరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ఆయన సీనియర్‌ ఆడిటర్‌ వహీద్‌బాషాను కలిసి ఎలా చెబితే అలా చేయమని చెప్పాడు. శ్రీనివాసులు తిరిగి వహీద్‌బాషాను కలువగా ఆయన రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారాలన్నింటిని నరేష్‌ చూస్తుంటాడని అతను ప్రస్తుతం సెలవులో ఉన్నాడని, లేదంటే రూ. లక్ష వరకు ఇచ్చుకోవాల్సి వచ్చేదని చెప్పాడు. ట్రెజరీ కార్యాలయ ఉద్యోగివి కాబట్టి రూ.50 వేలు ఇవ్వమని వహీద్‌బాషా డిమాండ్‌ చేశాడు. శ్రీనివాసులు తాను అంత ఇవ్వలేనని రూ. 30 వేలు ఇస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన వహీద్‌బాషా శనివారం లోపల నగదు ఇవ్వాలని సూచించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌రావును ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో వహీద్‌బాషా శనివారం ఉదయం శ్రీనివాసులుకు ఫోన్‌ చేసి ఫైల్‌ రెడీ అయిందని తెలిపాడు. జిల్లా ఆడిట్‌ అధికారి  నెల్లూరు హాస్పిటల్‌ వద్ద ఉన్నాడని, అక్కడకు వచ్చి డబ్బులు ఇస్తే వెంటనే ఫైల్‌ ఇస్తామని చెప్పాడు. శ్రీనివాసులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. వారి ఆదేశాల మేరకు నెల్లూరు హాస్పిటల్‌కు చేరుకున్నారు. రూ. 30 వేలు లంచం వహీద్‌బాషాకు ఇచ్చారు. ఆయన షణుఖ్మరెడ్డికి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌రెడ్డి, సిబ్బంది  ఆడిట్‌ అధికారి, సీనియర్‌ ఆడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
    విస్తృతంగా తనిఖీలు
    జిల్లా ఆడిట్‌ అధికారి షణ్ముఖరెడ్డి, సీనియర్‌ ఆడిటర్‌ వాహీద్‌బాషా ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌రెడ్డి రంగనాయకులపేటలోని జిల్లా ఆడిట్‌ కార్యాలయంలో, చిల్డ్రన్స్‌ పార్కు వద్దగల షణ్ముఖరెడ్డి, రంగనాయకులపేట ముస్లింవీధిలోని వహీద్‌బాషా ఇళ్లలో సోదాలు నిర్వహించారు. పలుకీలక పత్రాలను స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే షణ్ముఖరెడ్డి పిల్లలకు తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో అతన్ని తర్వాత పూర్తిస్థాయిలో విచారిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 
     
    లంచం ఇవ్వడం ఇష్టంలేకనే : శ్రీనివాసులు, బాధితుడు
    ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరుకు జిల్లా ఆడిట్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. నరేష్‌ రూ. లక్ష డిమాండ్‌ చేశారు. ఆయన సెలవులో వెళ్లాడు. జిల్లా ఆడిట్‌ అధికారికి పరిస్థితి వివరించా. ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వహీద్‌బాషాను కలవమన్నారు. వహీద్‌బాషా రూ. 50 వేలు డిమాండ్‌ చేశారు. తాను అంత ఇవ్వలేనని చెప్పా. రూ.30 వేలు ఇవ్వాలన్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement