అనంతపురం సెంట్రల్ : రుద్రంపేటలో జరిగిన గోపినాయక్–వెంకటేష్‌నాయక్‌ల జంట హత్య కేసులో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఉదయం నుంచే హత్య కేసులో నిందితులు లొంగిపోతారని హైడ్రామా నడిచింది. మధ్యాహ్నంలోగా పోలీసులు మీడియా ఎదుట హాజరుపరుస్తారని చర్చ నడిచింది. చివరకు మీడియా ప్రతినిధులెవరూ లేని సమయంలో నిందితులు లొంగిపోయినట్లు సమాచారం. నగరంలో ఓ మైనార్టీ నేత మధ్యవర్తిత్వంతో ఈ తతంగం నడిచింది. హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిలో అమర్, చంద్ర, పోతులయ్య, రాములు లొంగిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. మిగతా నిందితులు దొరికిన తర్వాత ఒకేసారి అరెస్ట్ చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
నాల్గవ పట్టణ స్టేషన్‌కు సీఐ ఎవరు..?
జంట హత్యలకు పోలీసుల వైఫల్యం కూడా కారణమని భావించిన అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌లను గత శనివారం సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఖాళీ ఏర్పడిన ఎస్‌ఐ స్థానానికి ఇదే స్టేషన్‌లో ఎస్‌ఐగా ఉన్న జీటీ నాయుడుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. సీఐ స్థానం మాత్రం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఇన్‌చార్జ్‌లను నియమిస్తారా? లేక ఒకేసారి రెగ్యులర్ సీఐని అపాయింట్ చేస్తారా అన్నది తెలియడం లేదు.