రాష్ట్రంలో మొదటి స్థానం సాధించాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా హరితహారం అమలులో మొదటి స్థానంలో ఉండాలని, వచ్చే రెండేళ్లలో నిజామాబాద్ ‘హరిత ఇందూరు’ కావాలని వ్యవసాయ, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్నలు ఆకాంక్షించారు. మన దేశంలో సగటున 27 చెట్లు మాత్రమే ఉన్నాయని, అందు వలన కరువు, కాటకాలు, వరదలు, తుఫాన్లు సంభవిస్తున్నాయన్నారు. ఫలితంగా పచ్చదనం కోసం మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఆదివారం మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్నలు జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, జిల్లా కలెక్టర్ యోగితా రాణా, ఆర్మూరు శాసన సభ్యులు జీవన్‌రెడ్డితో కలిసి పెర్కిట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... అడవుల సంరక్షణకు ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. చెట్లను నరికి అక్రమంగా కలపను తరలించే వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పీడీ యాక్డు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. చెట్టును కొట్టే హక్కుదాని యాజమానికి కూడా లేదని, ఇక నుంచి చెట్టు కొట్టాలంటే గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి అని అన్నారు. తల్లి బిడ్డకు ఉన్న సంబంధమే, చెట్టుకు– మనిషికి ఉన్న సంబంధమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వర్షాలు రావడం లేదన్నారు. మనకు కనపడే సత్యాన్ని గుర్తించాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల చొప్పున, నియోజక వర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. హరితహారం కింద చేపట్టే ప్రతి పనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని వివరించారు.
కనీసం 12 మొక్కలు నాటాలి..
ప్రతి ఒక్కరు కనీసం 12 మొక్కలు నాటితే ఈ సంవత్సరం 46 కోట్ల చెట్లను పెంచవచ్చని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8,695 గ్రామ పంచాయతీలలో 11,410 గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మన నిత్య జీవితం చెట్టుతోనే ముడిపడి ఉంటుందని, అందరు భాగస్వాములైతే ఒకే రోజులో జిల్లాకు నిర్దేశించిన 3.50 కోట్ల మొక్కలు నాటడం సమస్య కాదన్నారు. జిల్లా కలెక్టర్ పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అన్ని అవసరాలకు వాడే నీటిని కొనలేమని, ప్రాణవాయువును కొనలేమని చెప్పారు. 40 వేల మొక్కలు నాటిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సోమేశ్వర్ గ్రామంలో 43 వేల మొక్కలు నాటినందున రూ.40 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. బ్లాక్ ప్లాంటేషన్‌లు విరివిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. చెట్లు లేకపోతే ప్రతి మనిషి ప్రతి దినం మూడు ఆక్సిజన్ సిలిండర్లు వాడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. జీవితకాలానికి దాని వ్యయం రూ. ఐదు కోట్లు దాటుతుందని తెలిపారు. ఈతవనాలు కనిపించకుండా పోవడం వల్లే కల్తీ కల్లు ఏరులై పారుతుందన్నారు. పంటకు యోగ్యం కాని భూముల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అలాగే 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. రెండు సంవత్సరాల్లో ఇంటికి రక్షిత నీటిని అందించేందుకు రూ.40 వేల కోట్లతో ప్రణాళిలి సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
పోటాపోటీగా కథలు, సామెతలు
పెర్కిట్‌లో హరితహారం సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు మొక్కల ప్రాధాన్యతపై క్లాసు ఇచ్చారు. తమదైన శైలిలో వృక్షసంపద, పచ్చదనంపై పోటాపోటీగా కథలు చెప్పి ప్రజలను హరితహారం వైపు ఆకర్షితులను చేసే ప్రయత్నం చేశారు. ‘‘ మీ బోర్లు పోస్తున్నాయా.. ఎందుకు పోయడం లేదు.. నీరు ఎందుకు ఎండిపోయింది... వర్షాలు ఎందుకు పడటం లేదు... ’’ అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ప్రశ్నలు వేస్తూ వారితోనే జవాబులు రాబడుతూ చివరకు చెట్ల యొక్క ఆవశ్యకతను వివరించారు. చెట్లకు మనుషులకు తల్లీ కొడుకుల అనుబంధం అంటూ చాలా ఉదాహరణలు చెప్పి ప్రజలను మొక్కలు నాటుతామని అనిపించారు. కలెక్టర్ డాక్టర్ యోగితారాణా‘‘ నేను ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నా... ఇక్కడ కరువు కాటకాలకు అంతరించిన అడవులే కారణం... మొక్కలు నాటడం మనందరి బాధ్యతగా మీ అందరికీ చెప్తున్నాం... ఇది మీరు విస్మరిస్తే ఒకవేళ నేను చనిపోయినా మిమ్మల్ని వదలి పెట్టను.. దేవుడికి మీపైనా ఫిర్యాదు చేస్తా.. నా తప్పు లేదు దేవుడా మొక్కలు నాటమని చెప్పిన వినడం లేదని పెర్కిట్ గ్రామస్తులైన మీపై చెప్తా.. అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు జాగ్రత్త’’ అంటూ మొక్కల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. భవిష్యత్‌లో నీటి కొరతను ఉదాహరణలతో వివరించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టింది మొదలు కాలిపోయే వరకు చెట్టుతోను మనిషి జీవితం ముడిపడి ఉందని, అలాంటి చెట్లను నిర్లక్ష్యం చేస్తే భావితరాల భవిష్యత్ అంధకారమే అన్నారు. హరితహారం సీఎం కేసీఆర్ మానసపుత్రికని, ఈ పథకం విజయవంతం కోసం అందరూ కృషి చేయాలంటూ చెట్లకు మనుషులకు ఉన్న బంధం, మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను వివరించారు. పెర్కిట్ సర్పంచ్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌డీఓ యాదిరెడ్డి, అడిషనల్ సీసీఎఫ్ ఎస్.కె. సిన్హా, ఉద్యానవనశాఖ డీడీ సునందరెడ్డి, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓలు సుజాత, ప్రసాద్, జోజి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.