సాగు, తాగునీరు కలుషితం
కాలువలు, చెరువుల్లోకి వ్యర్థ నీరు
డెల్టాలో దుస్థితి
దెబ్బతింటున్న నారుమళ్లు
రైతులు, ప్రజలు బెంబేలు
పట్టించుకోని అధికారులు
డెల్టాపై నీలినాగు పడగ విప్పింది. ఆక్వా సాగు(నీలివిప్లవం) చాపకింద నీరులా పాకుతోంది. అనుమతి లేకుండా రొయ్యల సాగు యథేచ్ఛగా జరుగుతోంది. అక్రమార్కులు చెరువుల్లోని కాలుష్య నీటిని పంటకాలువల్లోకి తోడేస్తుండడంతో సాగు, తాగునీరు కలుషితమవుతోంది. ఫలితంగా వరి నారుమళ్ల దశలోనే దెబ్బతింటోంది. తాగునీటి చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి.
ఆకివీడు : పశ్చిమడెల్టా ఒకప్పుడు పైరు పచ్చని సీమ. ధాన్యాగారం. సుమారు ఆరు లక్షల 20వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ఆయకట్టులో ఎంత కష్టించినా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి పెట్టుబడి దక్కకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండడంతో రైతులు వరి సాగు నుంచి నీలి విప్లవం(ఆక్వా సాగు) వైపు అడుగులు వేశారు. ఫలితంగా పొలాలు చేలుగా మారాయి. ప్రస్తుతం ఆయకట్టులో సుమారు 54వేల ఎకరాలు చేపలు చెరువులు ఉన్నాయి. మరో లక్ష ఎకరాల్లో చేపల చెరువుల పేరిట అనధికారికంగా రొయ్యల సాగు జరుగుతోంది. ఇవికాక అనుమతి పొందిన రొయ్యల చెరువులు 15వేల ఎకరాలు ఉన్నాయి.
పడగ విప్పిన కాలుష్యం
ఆక్వా చెరువుల వల్ల కాలుష్యం పడగ విప్పింది. ముఖ్యంగా రొయ్యల చెరువుల నుంచి వెలువడే వ్యర్థ ఉప్పునీరు వల్ల అనర్థం జరుగుతోంది. చెరువుల సాగుదారులు వ్యర్థనీటిని మురుగు కాలువల్లోకి వదలాల్సి ఉండగా, అలా చేయకుండా యథేచ్ఛగా పంట కాలువల్లోకి తోడేస్తున్నారు. ఫలితంగా 11 పంట కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ ప్రభావం సాగు, తాగునీటిపై పడుతోంది. పంట కాలువల్లోని ఉప్పునీరు వరి పొలాల్లోకి చొచ్చుకెళ్లి నారుమళ్లు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం డెల్టా వ్యాప్తంగా సుమారు 50వేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నట్టు అంచనా. అలాగే డెల్టాలోని తాగునీటి చెరువులకు పంట కాలువల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల 300 తాగునీటి చెరువులూ కాలుష్య కాసారాలుగా మారుతున్నట్టు సమాచారం. ఈ నీటిని శుద్ధిచేసినా.. స్వచ్ఛ తాగునీరు సరఫరా సాధ్యం కావడం లేదని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే డెల్టాలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కాలువల వ్యవస్థ మారాలి
కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా డెల్టాలోని కాలువల వ్యవస్థను మార్చాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. చేపలు, రొయ్యల చెరువులకు ప్రత్యేకంగా మురుగు బోదెలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనికోసం అధికారులు తక్షణం చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలి
గోదావరితోపాటు, ప్రధాన పంట కాలువలు పూర్తిగా కాలుష్యానికి గురయ్యాయి. డెల్టాకు వచ్చే 11 కాలువల్లోకి మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థ నీరు చొచ్చుకువస్తోంది. రాజమండ్రి నుంచి ప్రధాన మురుగు కాలువ నీరు గోదావరిలోకి రావడం వల్ల ఆ నీరు దిగువ ప్రాంతమైన పశ్చిమ డెల్టాకు సరఫరా అవుతోంది. కాలుష్యం బారి నుంచి కొంతైనా బయటపడేందుకు తాగునీటి కోసం ప్రత్యేక పైప్‌లైన్లు డెల్టా అంతా ఏర్పాటు చేసి, చెరువుల్లోకి అమర్చాలి. దీనికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. దీనిని సర్కారు దృష్టికి తీసుకెళ్తాం.
ఎం.వి.సూర్యనారాయణరాజు, పర్యావరణ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు.
మురుగు కాలువల్లోకే వదలాలి
ఆక్వా చెరువుల్లోని వ్యర్థ నీటిని మురుగు కాలువల్లోకే వదలాలి. డెల్టాలో 1.54 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది.15 వేల ఎకరాల్లో మాత్రమే అనుమతి పొందిన రొయ్యల చెరువులు ఉన్నాయి. అనుమతి లేని చెరువులపై సర్వే జరుగుతోంది.
ఫణి కిషోర్, డిప్యూటీ డైరెక్టర్, నీటిపారుదల శాఖ, భీమవరం.