‘యనమదుర్రు’ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్
Published Tue, Apr 25 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
భీమవరం: కాలుష్య కాసారంలా మారిన యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. భీమవరం విష్ణు కళాశాలల ఆడిటోరియంలో మంగళవారం యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, ప్రజాప్రతినిధిలు, వివిధ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పితాని మాట్లాడుతూ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ప్రతి పరిశ్రమ వద్ద తప్పనిసరిగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
జిల్లాలో డ్రెయిన్ల కాలుష్యానికి పరిశ్రమల వ్యర్థాలతో పాటు ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలు చెత్తాచెదారాలతో నింపడం, ఆక్వా సాగు కూడా కారణమవుతున్నాయన్నారు. పరిశ్రమలల్లోని ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం నిజమని పేర్కొన్నారు. ఆక్వాతో భూగర్భ, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, ఆక్వాకు ప్రభుత్వం అనుకూలం తప్ప పూర్తిస్థాయిలో ప్రోత్సహించడం లేదని చెప్పారు. పలు గ్రామాలు, పట్టణాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. తుందుర్రులో ఆక్వాపార్క్ వ్యతిరేక ఉద్యమంతో మిగిలిన ఫ్యాక్టరీల్లోనూ కాలుష్యం వెలువడకుండా అధికారులు చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. వచ్చేనెల 10వ తేదీలోపు యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయాలని పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు.
కాలుష్యపాపం తలాపిడికెడు: కలెక్టర్
యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యానికి అందరూ కారకులేనని, తలాపాపం తిలాపిడికెడు అన్నట్టుగా మారిందని కలెక్టర్ భాస్కర్ అన్నారు. పరిశ్రమలు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు ఏర్పాటుచేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం ఖర్చును భరించనున్నాయని చెప్పారు. యనమదుర్రు డ్రెయిన్ పరిధిలోని 21 పరిశ్రమలను గుర్తించి వాటిలో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టిందన్నారు.
సమావేశంలో ఫ్యాక్టరీస్ సంచాలకుడు జి.బాలకిశోర్, పర్యావరణ శాఖ జాయింట్ చీఫ్ ఇంజినీర్ ఎంవీ భాస్కరరావు, పర్యావరణ సీనియర్ ఇంజినీర్ పి.రవీంద్రనాథ్, పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కొవ్వూరు ఆర్డీఓ బి.శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు, శెట్టిపేట ఈఈ జి.శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు, డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నీటి కాలుష్యంతో కేన్సర్..డెల్టా ప్రాంతంలో నీటి కాలుష్యంతో కేన్సర్ రోగులు పెరుగుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయకుంటే ఈ ప్రాంత ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ప్రక్షాళనలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి.–పులపర్తి రామాంజనేయులు, భీమవరం ఎమ్మెల్యే
మున్సిపాలిటీల చెత్త కూడా..నిడదవోలు-నరసాపురం కాలువలో పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీల మురుగు నీరు, చెత్తాచెదారాలు కలుస్తున్నాయి. మృతదేహాలను సైతం కాలువల్లో వేయడం కలుషితానికి కారణమవుతోంది. యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యానికి పరిశ్రమల యజమానుల నిర్లక్ష్యమే కారణం. –బండారు మాధవనాయుడు, నర్సాపురం ఎమ్మెల్యే
అధ్యయనాలు చేస్తున్నా అమలు శూన్యం..జిల్లాలోని పంట కాలువలు, డ్రెయిన్ల కలుషితంపై ప్రభుత్వం అధ్యయనాలు చేస్తున్నా వాటి ప్రక్షాళనకు చేస్తున్న చర్యలు శూన్యం. జిల్లాలో కొల్లేరు, యనమదుర్రు, గోస్తనీ, గొంతేరు కాలుష్య కారకంగా మారడానికి పరిశ్రమలే కారణం. ఆక్వా సాగుతోనూ డ్రెయిన్, కాలువ జలాలు కలుషితమవుతున్నాయి.–బి.బలరాం, సీపీఎం జిల్లా కార్యదర్శి
మత్స్య సంపద మాయం..యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంలా మారడంతో మత్స్య సంపద పూర్తిగా మాయమైపోయింది. గతంలో డ్రెయిన్‌పై ఆధారపడి 30 గ్రామాల్లోని సుమారు 80 వేల మంది మత్స్యకారులు జీవనం సాగించేవారు. భీమవరం మండలం కొత్తపూసలమర్రులోని ఆనంద గ్రూప్ రొయ్యల మేత పరిశ్రమ వల్ల వాతావరణం కూడా కాలుష్యమవుతోంది. –రామకృష్ణ, మత్స్యకార సంఘ నాయకుడు
నీటిమీద రాతలుగా..జిల్లాలో డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు నీటిమీద రాతలుగా మిగులుతున్నాయి. ఆక్వా సాగుతో భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆక్వా అక్రమ సాగుకు అధికారులే అనుమతులు ఇస్తున్నారు. వివిధ పరిశ్రమల్లో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు లేకపోయినా పట్టించుకోవడం లేదు.–డేగ ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి
మున్సిపల్, పంచాయితీల చెత్త కాలువల్లోనే..డెల్టా ప్రాంతంలోని వివిధ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు మురుగునీటిని పంట కాలువల్లో కలపడంతోపాటు చెత్తను కూడా వేస్తున్నారు. దీంతో జల కాలుష్యం పెరుగుతోంది. నీటి కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. –పొత్తూరి రామాంజనేయరాజు, జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్
Advertisement
Advertisement