సినిమాల్లోకి రాకుంటే.. జైల్లో ఉండేవాణ్నేమో!
రాళ్లపల్లి పరిచయంతోనే ఈ స్థాయికి..
తనికెళ్ల ఊరిలో మా పూర్వికులు ఉండేవారేమో..?
ఖమ్మం కల్చరల్ : ప్రముఖ సినీ నటులు, రచయిత, కవి తనికెళ్ల భరణి మనసు విప్పి హాయిగా మాట్లాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలు చెప్పారు. తనికెళ్ల ఊరితో ఉన్న సంబంధమేంటో వివరించారు. నాటకాలకు ఆదరణ లేదనొద్దని.. ఏం చేయాల్సి ఉందో ఉపదేశించారు. భాషలో యాసలను గుర్తించొద్దని, తెలుగువారమనే విషయం మరువొద్దని అన్నారు. ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఖమ్మం వచ్చిన ఆయన జూబ్లీక్లబ్‌లో విలేకరులతో ముచ్చటించారు. కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, రచయితలతో కవి సమ్మేళనం, ఇష్టాగోష్టిలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
28 ఏళ్లు నాటకాలు వేశా..
విద్యార్థిగా ఉన్నప్పట్నుంచే నాటకాలంటే మక్కువ. సినిమాల్లోకి రాకముందు 28 ఏళ్లపాటు నాటకాలు వేశారు. అప్పట్లో రిహార్సల్స్ ఎక్కువ. నేడు ఒకట్రెండు నాటకాల్లో నటించగానే సినిమాల్లో చాన్స్‌లు వెతుక్కుంటుంటే..ఇక నాటకాలకు ఆదరణ ఎక్కడ లభిస్తుంది..?.
నాటకాలకు ఆదరణ రావాలంటే..
అద్భుతమైన ప్రదర్శన చేయాలి. కథ, కథనం, లెక్కకు మించి రిహార్సల్స్ చేసినప్పుడు, నాటకం బాగా వస్తుంది. అప్పుడు ఆదరణ పెరుగుతుంది. హరికథలు, బుర్రకథలు, తోలు బొమ్మలాటలు, యక్షగానాలు, నాటకాలకు పూర్వ వైభవం రావాలంటే కళాకారుల చేతుల్లోనే ఉంటుంది. ప్రేక్షకుడు మెచ్చేలా నాటకాలు లేవన్నది కూడా వాస్తవమే.
ఇతిహాసాలు చదవాలి..
రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలను చదివి, జ్ఞానం సంపాదించిన వారికే కవులుగా, కళాకారులుగా, రచయితలుగా రాణించేందుకు అర్హత ఉంటుందనేది నా అభిప్రాయం.
మారకుంటే జైల్లో ఉండేవాణ్ని..
నా బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా శంఖంపేట రైల్వే క్వార్టర్స్‌లో గడిచింది. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవాణ్ని. హత్యలు, దొంగతనాలు చేసేవారితో స్నేహం చేశా. అదే కంటిన్యూ అయితే.. కచ్చితంగా ఏదో ఒక నేరం చేసి ఖమ్మం జైల్లోనే ఉండేవాణ్ణేమో(సరాదాగా నవ్వుతూ).
అలా మారిన జీవితం..
అప్పటి సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావుతో ఏర్పడిన పరిచయం నా జీవితాన్ని మార్చింది. నాటకాల్లో అవకాశాలు కల్పించారు. అలా..సినిమాల్లోనూ చాన్స్‌లు లభించి ఈరోజు ఈ స్థాయికి చేరా. ఇప్పటికి 700 కుపైగా సినిమాల్లో నటించా. కానీ..మంచి అనుభూతిని మిగిల్చింది మాత్రం ‘మిథునం’ సినిమానే. ఉత్తమ చిత్రం అవార్డు రావడం మర్చిపోలేని అనుభూతి. సిరా అనే లఘుచిత్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించింది.
యాసలు వేరైనా భాష ఒక్కటే..
యాసలు వేరైనా తెలుగు భాష ఒక్కటే. సినిమాల్లో తెలంగాణ యాసను వ్యంగ్యంగా వాడుతున్నారంటే.. కోపంతో కాదు. ఎలా పలకాలో తెలియకనే. ‘మొండిమొగుడు.. పెంకిపెళ్లాం’ అనే సినిమాలో హీరోయిన్‌ని పూర్తిస్థాయి తెలంగాణ యాసలో మాట్లాడించింది నేనే. సామాన్య మానవుడు శంకరునితో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియజెప్పాలనే ‘శభాష్ రా శంకర’ అనే గేయాన్ని రచించా.
తనికెళ్ల మా ఊరేనేమో..!
కొణిజర్ల మండలంలో ఉన్న తనికెళ్ల ఊరిపేరే నా ఇంటిపేరుగా ఉండడం విచిత్రం. బహుశా.. మా పూర్వీకులది తనికెళ్ల అయ్యుంటుంది. ఇక్కడి నుంచి వలస వచ్చామేమో అని మా పెద్దలు చెబుతుండేవారు. వాస్తవానికి మా నాన్నగారు టీచర్. పశ్చిమ గోదావరి జిల్లాలోని రైల్వేక్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. సినిమాల్లోకి రాకముందే, బీకాం చదువుతున్నప్పుడే ఖమ్మంతో అనుబంధముంది. 1974 లో ఖమ్మం కళాపరిషత్ సభ్యులతో కలిసి నాటకం వేశా.
పద్మశ్రీ నాకొద్దు..
తెలుగు చిత్రసీమలో ఎందరో గొప్ప నటులున్నారు. సూర్యకాంతం, సావిత్రి, ఎస్‌వీ. రంగారావు లాంటి మహానటులకు పద్మశ్రీ సత్కారం దక్కలేదు. అందుకే భవిష్యత్‌లో నాకు పద్మశ్రీ వచ్చినా.. నేను స్వీకరించను. సున్నితంగా తిరస్కరిస్తా.