కల్తీ పెట్రోల్‌తో అవస్థలు | Adulterated petrol stranding | Sakshi
Sakshi News home page

కల్తీ పెట్రోల్‌తో అవస్థలు

Published Mon, Aug 12 2013 1:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

Adulterated petrol stranding

సీలేరు, న్యూస్‌లైన్: మన్యం అందాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కల్తీ పెట్రోల్‌తో అవస్థలుపడుతున్నారు. మన్యంలోని పలు పర్యాటక కేంద్రాల్లో పెట్రోల్ బంకులు అందుబాటులో లేకపోవడంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ లభించడం లేదు. దీంతో పలువురు వ్యాపారులు విడిగా అమ్మే  కల్తీ పెట్రోల్, డీజిల్ బారిన పడుతున్నారు.

సీజన్‌లో రోజూ వందల సంఖ్యలో కార్లు, వ్యాన్లు, టూరిస్ట్ బస్సుల్లో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు కావడంతో ఇక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయని వారు భావిస్తుంటారు. చింతపల్లి, ఒడిశా, మల్కన్‌గిరి, భద్రాచలం వంటి ప్రాంతాల్లోనే పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిని దాటుకుని ఇక్కడికి వచ్చాకా బంకులు లేవని తెలుసుకుని ఏమీ చేయలేక కల్తీ పెట్రోల్, డీజిల్‌ను ఆశ్రయిస్తున్నారు. పెట్రోల్ వ్యాపారులు పర్యాటకుల నుంచి అధిక ధర వసూలు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో మన్యంలో వాహనాల సంఖ్య జోరందుకున్న నేపథ్యంలో పెట్రోలు దుకాణాల సంఖ్య బాగా పెరిగాయి. వాహనాల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు గమనించిన జీసీసీ అధికారులు పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు గత ఏడాది హామీ ఇచ్చారు. అప్పటి చింతపల్లి జీసీసీ మేనేజర్ కన్నయ్య పెట్రోల్ బంక్ ఏర్పా టు కోసం స్థల సేకరణ కూడా చేశారు. దీనికి జెన్‌కో అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ జీసీసీ అధికారులు బంక్ ఏర్పాటు చేసే విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకుల వాహనాలను దృష్టిలో ఉంచుకుని సీలేరులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు జీసీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని వా హనదారులు, స్థానికులు కోరుతున్నారు. బంక్ ఏర్పాటు వల్ల మంచి ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు.

 ఒడిశా నుంచి దిగుమతి...

 ఈ ప్రాంతాల్లో అమ్ముతున్న పెట్రోల్‌ను ఒడిశా మల్కన్‌గిరి జిల్లా నుంచి తీసుకువస్తున్నారు. మన రాష్ట్రంలో కన్న తక్కువ ధరకు లభించడంతో అక్కడ నుంచి వేల లీటర్ల పెట్రోల్ తీసుకుచ్చి కల్తీ చేసి ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. డీజిల్, ప్రెటోల్లో కల్తీ జరగడంతో కొద్ది దూరం వేళ్లే సరికి వాహనాలు మొరాయిస్తున్నాయని వాహనచోదకులు ఆవేదన చెందుతున్నారు. బంకు ఏర్పాటు చేసే వరుకూ ఇక్కడ పెట్రోల్, డీజిల్‌ల్లో కల్తీ జరక్కుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నాన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement