సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా యోసూ పట్టణంలోని బిగ్ ఓ మ్యూజికల్ ఫౌంటెన్ షోను శనివారం మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు తిలకించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఫౌంటెన్ కంటే ఆధునికమైన ఫౌంటెయిన్‌ను కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను పరిశీలించి ఆధునిక హంగులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు.
రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్ ఫౌంటెయిన్‌లు, జెయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిని కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment