మరణశయ్యపై మీన‘వేషాలు’ | AGENCY PEOPLE DEAD | Sakshi
Sakshi News home page

మరణశయ్యపై మీన‘వేషాలు’

Published Tue, Sep 20 2016 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 9:29 PM

మరణశయ్యపై మీన‘వేషాలు’ - Sakshi

మరణశయ్యపై మీన‘వేషాలు’

  • వ్యాధి తీవ్రత తగ్గించకుండా తప్పించుకునే ధోరణి
  • తాజాగా మరొకరు మృతి
  • తాగుడు వల్లనే మరణాలనే కలెక్టర్‌ వ్యాఖ్యలపై గిరిజనాగ్రహం
  • రక్త నమూనా పరీక్షలు రాకుండానే ఎలా నిందలేస్తారు
  • ఇంటర్‌ విద్యార్థులు చనిపోయారు ... వారు తాగుబోతులా
  •  
    సాక్షిప్రతినిధి, కాకినాడ : 
    మన్యం మరణాలపై తన బాధ్యత లేదన్నట్టు సర్కార్‌ తప్పించుకునే ఎత్తులు వేస్తోంది. అంతుచిక్కని వ్యాధితో ఏజెన్సీలోని విలీన మండలం వీఆర్‌పురంలో ఐదుగురు మృత్యువాతపడి పలు మండలాలకు చెందిన 32 మంది మంచంపట్టి ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో గిరిజన గ్రామాలు భయంతో హడలెత్తిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో బాధితుల్లో మనోధైర్యం నింపాల్సిన సర్కార్‌  అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతెందుకు ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన నాలుగు రోజుల వరకు రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించకపోడం నిర్లక్ష్య తీవ్రతను అద్ధం పడుతోంది. మృత్యువాతపడిన గిరిజనులను ప్రభుత్వం తరఫున పరామర్శించేందుకు రావడానికి మంత్రి రావెల కిశోర్‌బాబుకు 30 రోజులు పట్టింది. అన్ని రోజుల తరువాత వస్తే వచ్చారు, కనీసం మృతుల కుటుంబాలకు నిర్థిష్టమైన హామీ ఏమీ ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోవడం గిరిజనుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అసలు ఆ గ్రామాలవైపు కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు. ఈ క్రమంలో అంతుచిక్కని వ్యాధిగ్రస్తుల పరిస్థితి అయోమయంగా మారింది.
    వ్యాధిని నిర్థారించకుండా తాగుడంటారా...
    వీఆర్‌పురం, చింతూరు మండలాల నుంచి కాళ్లవాపు వ్యాధితో వచ్చిన 32 మందికి కాకినాడ జీజీహెచ్‌లో ఇఎన్‌టీ విభాగంలో ప్రత్యేకంగా వైద్య సేవలు మాత్రం అందిస్తున్నారు. వ్యాధిగ్రస్తుల రక్త నమూనాలను విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి పంపించారు. ఆ రక్త పరీక్షలకు సంబంధించిన నివేదికలు ఇప్పటి వరకూ రాలేదు. ఆ నివేదికలు రావడానికి నాలుగైదు రోజులు సమయం పడుతుంది. ఈ విషయాన్ని కాకినాడ జీజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ఎంఓ సి.ఎస్‌.ఆర్‌. మూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. ఆ రక్త నివేదికలు రాకుండా మరణానికి కారణాలను విశ్లేషించ లేమని వైద్యులే చెబుతున్నారు. వాస్తవం ఇలా ఉండగా ఆ మరణాలకు నాటుసారా తాగడమే కారణమంటూ జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ చెప్పినట్టుగా పత్రికల్లో (సాక్షికాదు) వచ్చిన కథనాలపై గిరిజనులు, గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. విశాఖ లేబొరేటరీ నుంచి నివేదికలు రాకుండా, వ్యాధి నిర్థారణ కాకుండా అందుకు గల కారణాన్ని ఏ ప్రాతిపదికన, ఎలా నిర్థారిస్తారని గిరిజనం ప్రశ్నిస్తోంది. గుర్తుతెలియని వ్యాధితో అన్నవరం గ్రామంలో ముగ్గురు గిరిజనులు మృతిచెందారు. మృతుల్లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని బురకా మంగవేణి కూడా ఉంది. మరో ఇంటర్‌ విద్యార్థి గొడ్ల కన్నయ్య కూడా ఇవే లక్షణాలతో మృత్యువాత పడ్డాడు. నాటుసారా తాగడం వల్లనే మృతి చెందారనేది నిజమైతే ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థిని కూడా నాటుసారా తాగిందంటారా అని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    సహజంగా గుర్తుతెలియని వ్యాధితో ఇటువంటి మరణాలు సంభవించినప్పుడు తక్షణ సాయంగా ప్రభుత్వం  ఆర్థిక సాయం ప్రకటించడం పరిపాటి. కానీ ఈ మరణాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఐదుగురు మరణించి అంతమంది కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తుల విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన పార్టీ ప్రతినిధులను వెంటనే గిరిజన గ్రామాల్లో పర్యటనకు పంపించారు. అక్కడ పరిస్థితులను తెలుసుకున్న పార్టీ జిల్లా నేతలు  సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న గిరిజనులను పేరుపేరునా పలకరించారు.
    జిల్లాకు సీఎం వచ్చినా...
    మధురపూడి ఎయిర్‌పోర్టు విస్తరణ పనుల శంకుస్థాపనకు జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు పట్టించుకోకుండా వెళ్లిపోయారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌ పోర్టు నుంచి కాకినాడ రావడానికి 70 కిలోమీటర్లు. సి.ఎం. తలచుకుంటే గంటలో జీజీహెచ్‌లో రోగులను చూసి వెళ్లిపోవచ్చు.  ఓదార్చాలనే తలంపే ఉంటే గంట ప్రయాణం పెద్ద విషయం కాదు. జిల్లాకు వచ్చి కూడా గిరిజనుల పరామర్శకు వచ్చే తీరిక లేదా, లేక తాను వస్తే ఆర్థిక సాయం ఎక్కువ మొత్తంలో ప్రకటించాల్సి వస్తుందనో, అంత ప్రాధాన్యం ఇవ్వకూడదనో సీఎం రాకపోవడానికి ఏదో ఒకటి కారణమై ఉంటుందని గిరిజన ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతాదృక్పధంతో ఆలోచించి గిరిజనుల్లో మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
     
    కలెక్టర్‌ ప్రకటనతో దిబ్బతిన్న గిరిజనుల మనోభావాలు
    కాళ్లవాపు అనేది నాటు సారా తాగటం మూలంగా వస్తుందని భావిస్తునట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటించడం దారుణం. దీని మూలంగా గిరిజన ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్నవరం గ్రామానికి చెందిన పూసం మంగవేణి ,గొడ్ల కన్నయ్యలు ఇద్దరూ ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు. వీరిద్దరూ కూడా ఇంటర్‌ చదువుకునే విద్యార్థులే. వీరు సారా తాగి చచ్చిపోయారంటే  ఎలా? అలాగే నా తమ్ముడు కుమారై బురకా భవానికి కూడా కాళ్లు వాపు రావడంతో ఆమెను కూడా కాకినాడ ఆస్పత్రికి తరలించాం. ఆమె కూడా ఇంటర్‌ చదివే విద్యార్థినే. ఈ వ్యాధికి కారణం కనిపెట్టలేక అధికారులు తప్పించుకునేందుకు ఇలా ప్రకటనలు చేయడం సరికాదు. 
    - బురకా కన్నారావు,(అన్నవరం) గిరిజన సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు   
     
    మా తమ్ముడికి  సారాతాగే అలవాటు లేదు... 
    మా తమ్ముడు బురకా మంగరాజుకు అసలు  మద్యం సేవించే  అలవాటు లేదు. ఇతడు ప్రస్తుతం కాళ్లవాపు వ్యాధి బారిన పడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా మండలంలో ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి నలుగురు చనిపోయారు. కానీ జిల్లా అధికారులు మాత్రం నాటు సారా తాగటం మూలంగానే ఈ మరణాలు సంభవించాయని అనడం బాధాకరం.
     -బురకా బాబురావు ,అన్నవరం గ్రామం,  ఉపసర్పంచ్‌(రేఖపల్లి పంచాయతీ) 
     
    ఇంటర్‌ చదివే నా కుమార్తె నాటుసారా తాగిందా...
    నాటు సారా తాగటం మూలంగానే  చనిపోయి ఉంటారని జిల్లా కలెక్టర్‌ చెప్పడం కలిచివేసింది. మా అమ్మయి మంగవేణి వీఆర్‌పురంలో ఇంటర్‌ చదివింది .ఈ వ్యాధి బారిన పడి గతనెల 13 న మృతిచెందింది. ఆమెను కాపాడుకోవడానికి ప్రయివేటు ఆస్పత్రిలో సుమారు  రూ.2 లక్షలు వరకు అప్పు చేసి ఖర్చు చేశాం. ప్రస్తుతం మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
     - పూసం ముత్తమ్మ ,మంగవేణి తల్లి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement