రెండు రోజుల్లో ఇద్దరు మహిళల మృతి | Two women killed in two days | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో ఇద్దరు మహిళల మృతి

Published Thu, Jun 16 2016 1:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:29 PM

Two women killed in two days

మరో ముగ్గురి పరిస్థితి విషమం ఆందోళనలో గిరిజనులు

 

హుకుంపేట: ఏజెన్సీలో మలేరియా తీవ్రత అధికంగా ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే  ఇద్దరు గిరిజన మహిళలు మృతిచెందగా.. ప్రతి గ్రామంలో ఒకరిద్దరు వ్యాధితో బాధపడుతున్నారు. తీగలవలస పంచాయతీ మారుమూల ఓలుబెడ్డ గ్రామంలో పదిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కిల్లో రంభో (35) అనే ఆదివాసీ మహిళ బుధవారం మృతిచెందింది. సెరిబ్రల్ మలేరియాతో రాప గ్రామానికి చెందిన  దేముడమ్మ అనే గిరిజన మహిళ మంగళవారం విశాఖ ఆస్పత్రిలో మృతిచెందగా బుధవారం మృతదేహాన్ని తీసుకువచ్చారు.  వేర్వేరు గ్రామాలకు చెందిన  ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని మారుమూల ఓల్డా పంచాయతీ రాప గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజారావు భార్య కాండ్రంగి దేముడమ్మ, ఆమె  పెద్ద కుమారుడు నాని(13)  వారం రోజుల నుంచి తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానికంగా మందులు వాడినా తగ్గుముఖం పట్టక, వారి పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో  రాజారావు తన భార్య, కుమారుడిని ఆదివారం  విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.


వారిని ఐసీయూలో ఉంచి  వైద్యసేవలు అందిస్తుండగా, దేముడమ్మ మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఆమె కుమారుడు నాని  పరిస్థితి కూడా విషమంగా  ఉందని బంధువులు చెబుతున్నారు. దేముడమ్మ మృతదేహన్ని బుధవారం రాప గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. రాప ఎంపీటీసీ సభ్యుడు దర్మయ్యపడాల్, పలువురు సీపీఎం నాయకులు  మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తంచేశారు. గ్రామాలలో ఉన్నత వైద్యసేవలు  కల్పించాలని డిమాండ్ చేశారు.  ఇదే పంచాయతీలోని కాంగుపుట్టు గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి బోయిన విజయలక్ష్మిని పాడేరు ఆస్పత్రికి తరలించగా వైద్యులు సెరిబ్రల్ మలేరియాగా నిర్ధారించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు మంగళవారం తరలించారు. ఇదే ప్రాంతంలోని బొడ్డాపుట్టు పంచాయతీ బందమామిడి గ్రామానికి చెందిన గలుంగుబోయిన గౌరి అరునెలల గర్భవతి కావడంతో ఆమెకు రక్తపరీక్షలు నిర్వహించి మలేరియాగా నిర్ధారించి పాడేరు ఆస్సత్రిలో వైద్యసేవలు కల్పిస్తున్నారు. కొట్నాపల్లి పంచాయతీ బిసాయిపుట్టు గ్రామానికి చెందిన  గెమ్మెలి కొండబాబు(25) అనే యువకుని పరిస్థితి విషమంగా ఉండటంతో  బుధవారం హుకుంపేట ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యుడు లీలాప్రసాద్  రక్తపరీక్షలు నిర్వహించి  సెరిబ్రల్ మలేరియాగా నిర్ధారించారు. మలేరియా సోకిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకొని తగిన చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదని,  నిర్లక్ష్యం చేస్తే  మలేరియా కాస్తా ప్రాణాంతక సెరిబ్రల్ మలేరియాగా మారి ,పరిస్థితి విషమంగా ఉంటుందని లీలాప్రసాద్ తెలిపారు. హుకుంపేట మండలంలో ఇప్పటికే  మూడు నెలల వ్యవధిలో 50 వరకు మలేరియా కేసులు నమోదయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement