విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని..
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్:కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని మాదాల నారాయణస్వామి భవన్‌లో గురువారం నిర్వహించిన పీడీఎస్‌యూ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ వరకు ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలోకి నెట్టివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మెకాలై విద్యా విధానమే నేటికి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొఠారి కమిషనర్ సూచించిన మేరకు కేంద్ర బడ్జెట్‌లో పది శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం, జీడీపీలో ఆరుశాతంగా ఉండాల్సిన విద్యారంగ కేటాయింపులు గత ఐదు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నిధుల కొరతతో ప్రభుత్వ విద్యాసంస్థలు కునారిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం 2016 పేరుతో విద్యా రంగాన్ని కాషాయికరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసిందని తెలిపారు. విద్యార్థి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి, అవినీతి, నల్లధనం నిర్మూల పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ కార్పొరేట్ శక్తులు, నల్లకుబేరులకే మేలు చేశారన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టల్స్ రద్దుకు ప్రభుత్వం పూనుకుని పేద వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. ష్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సవాలక్ష ఆంక్షలు పెట్టి విద్యార్థులను అనర్హులను చేసే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించి, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రసాద్, పీడీఎస్‌యూ న్యాయవాదుల వేదిక కన్వీనర్ ఎస్.సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షురాలు ఎన్.ఝాన్సి, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రకృతి, నాయకులు బి.నందకిషోర్, అక్బర్ బాషా, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.