కంది పంటను కాపాడుకోండి
– వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా బెట్టను ఎదుర్కొంటున్న కంది పంటకు శనగపచ్చపురుగు, మారుకామచ్చల పురుగులు, ఈగ రెక్కల పురుగులు ఆశించి నష్టం కలిగిస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లోనూ ఏకపంటగానూ, అంతర పంటగా కంది సాగైందన్నారు. బెట్ట నుంచి కొంత వరకు పంటను రక్షించడానికి ఓ వైపు ట్యాంకర్లు, రెయిన్‌గన్లు, పైపుల ద్వారా కంది పంటకు రక్షకతడులు కూడా ఇస్తున్నామని తెలిపారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు ఒక తడి ఇచ్చుకుంటే మేలన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన సస్యరక్షణ సిఫారసులు పాటించి కందిని కాపాడుకోవాలని సూచించారు.
+ శనగపచ్చ పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా 5 శాతం వేపగింజల కషాయంలేదా 5 మి.లీ వేపనూనె ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ, పూత దశలో 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ 20 ఈసీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిందె, కాయ దశలో 2 మి.లీ క్వినాల్‌ఫాస్ 25 ఈసీ లేదా 1 గ్రాము అసిఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1 మి.లీ ఇండాక్సికార్బ్ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిప్రొల్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
+ మారుకామచ్చల పురుగు నివారణకు కూడా శనగపచ్చ పురుగుకు సిఫారసు చేసిన మందులను వాడవచ్చు. పొలంలో పురుగు గూళ్లు గమనిస్తే 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ 20 ఈసీ లేదా 1 మి.లీ నొవాల్యురాన్ లేదా 2 మి.లీ క్వినాల్‌ఫాస్ 25 ఈసీ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ ఇందులో ఏదో ఒక మందుకు ఊదర స్వభావం కలిగిన 1 మి.లీ డైక్లోరోవాస్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ కాయతొలిచే ఈగ నివారణకు ఎకరాకు 8 నుంచి 10 కిలోలు వేపగింజల పొడి కషాయాన్ని పిందె దశలో పిచికారీ చేస్తే పెద్ద పురుగులు గుడ్లు పెట్టవు. 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.