ఏకపంటగా కంది వేసుకోండి
అనంతపురం అగ్రికల్చర్ : ఏకపంటగా కంది వేయాలనుకునే రైతులు ఇపుడు విత్తుకోవచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, పంటల సాగు గురించి ఆయన పలు సూచనలు చేశారు.
+ నైరుతీ రుతుపవనాలు జిల్లాలో విస్తరించాయి. ఈ రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉంది. 29 నుంచి 31 డిగ్రీలు గరిష్టం, 23 నుంచి 24 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. గాలిలో తేమశాతం ఉదయం 74 నుంచి 78, మధ్యాహ్నం 53 నుంచి 57 శాతం ఉండవచ్చు. గంటకు 11 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయి.
+ సాలు పదును అంటే వారం రోజుల వ్యవధిలో 60 నుంచి 70 మి.మీ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో పంటలు విత్తుకుంటే మేలు. అరకొర పదునులో వేసుకోవడం వల్ల మొలకశాతం తగ్గిపోతుంది.
+ మంచి పదును అయిన ప్రాంతాల్లో ఏకపంటగా కందికి జూన్ నెల అనుకూలం. దీర్ఘకాలిక రకాలైన ఎల్‌ఆర్‌జీ–30, ఎల్‌ఆర్‌జీ–41, స్వల్పకాలిక రకాలైన పీఆర్‌జీ–176, లక్ష్మి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోలు నత్రజని, 20 కిలోలు భాస్వరం ఎరువులు వేసుకోవాలి.
+ రైతులు ఈ వర్షాలను ఉపయోగించుకుని పొలాలను దున్నుకోవాలి. రెండు మడకల నాగలి లేదా సబ్సాయిలర్‌తో వాలుకు అడ్డంగా దున్నాలి. దీని వల్ల తేమ శాతం పెరగడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చు.
+ భూసార పరీక్ష ఆధారంగా పంటలు వేసుకుని ఎరువులు వేస్తే పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గుతాయి.
+ ఇపుడున్న వాతావరణ పరిస్థితులు అరటి పిలకలు నాటుకునేందుకు అనుకూలం. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల అరటి సాగు చేసుకోవచ్చు.
+ చీనీ కాయలు కోత పూర్తయిన ప్రాంతాల్లో కొద్దిరోజులు బెట్టకు గురిచేయాలి. కొత్తగా చీనీ తోటలు నాటుకునే రైతులు ఒక అడుగు లోతు, వెడల్పు గుంతలు తీసి అందులో 25 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 100 గ్రాములు లిండేన్ పొడి వేసి నాటుకుంటే తెగుళ్లు, చీడ పీడల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు.