‘అనంత పాలంటే పారిపోతున్నారు’ | agriculture story | Sakshi
Sakshi News home page

‘అనంత పాలంటే పారిపోతున్నారు’

Published Sat, Mar 11 2017 11:22 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

‘అనంత పాలంటే పారిపోతున్నారు’ - Sakshi

‘అనంత పాలంటే పారిపోతున్నారు’

– నాణ్యత పెంచితే ప్రోత్సాహకాలు
– 100 లీటర్ల పాలు వచ్చే ప్రాంతాల్లో సొసైటీలు
– ఏపీ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి వెల్లడి


అనంతపురం అగ్రికల్చర్‌ : ‘మదనపల్లి, కడప, రాయచోటి నుంచి వచ్చే పాలకు మంచి డిమాండ్‌ ఉంది. అనంతపురం పాలకు అంతంత మాత్రంగా, హిందూపురం పాలకు అసలే అధ్వానంగా ఉండటంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అనంత’ పాలంటే పారిపోతున్నారు.’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఏపీ డెయిరీ మార్కెటింగ్‌ విభాగం అధికారి పాపారావుతో కలిసి శనివారం స్థానిక ఏపీ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా డెయిరీ పనితీరు, వివిధ విభాగాలు, యంత్రసామగ్రిని పరిశీలించారు. డెయిరీ స్థితిగతులు, రైతుల ఆర్థిక పరిస్థితులు, ప్రైవేట్‌ డెయిరీల ఆధిప్యతం తదితర అంశాలపై డీడీ వై.శ్రీనివాసులు, ఏడీ శ్రీనివాసులు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అనంతపురం, హిందూపురం పాలశీతలీకరణ కేంద్రాల నుంచి సేకరిస్తున్న పాలు నాసిరకంగా ఉంటున్నాయన్నారు. రైతుల నుంచి నాణ్యమైన పాల సేకరించడంలో ఏజెంట్లు, జిల్లా అధికారులు వైఫలం చెందుతున్నారని తెలిపారు. ఇందులో రైతులు కూడా పాలలో నీళ్లు అధికంగా కలుపుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఆవు ఈనిన రోజు నుంచి మళ్లీ ఒట్టిపోయే దాకా ఒకే మోతాదులో పాలు పోస్తుండటం జరుగుతోందన్నారు. ఇలా రైతులు కూడా అవగాహన లోపంతో పాలు పోస్తుండగా ఇంటిదొంగలు కూడా అందులో నీళ్లు కలపడం, అవకతవకలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని అసహనం వెలిబుచ్చారు. కొవ్వు, వెన్నశాతం తక్కువగా వస్తుండటం వల్ల రైతులకు ధరలు గిట్టుబాటు కావడం లేదన్నారు.

నాణ్యమైన పాలకు మంచి గిరాకీతో పాటు ధరలు కూడా పలుకుతాయని, రైతులు అపోహలు విడనాడి మంచి పాలు పోయాలని సూచించారు. ఆ దిశగా రైతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత డెయిరీ, పశుశాఖ అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తుల పంపకం పూర్తీ కాకపోవడంతో డెయిరీ కొంత వరకు కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీని వల్ల సకాలంలో బిల్లులు చెల్లింపు, వేతనాలు చెల్లింపు, నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేక పోతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతపురం జిల్లాలో 100 లీటర్లు పాల సేకరించే ప్రాంతాల్లో రైతులతో సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. సహకార బ్యాంకుల్లో మహిళ రైతులతో అకౌంట్లు ఓపెన్‌ చేయించి బిల్లులు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు. కంప్యూటరీకరణ, రేషన్‌ బ్యాలెన్సింగ్‌ ప్రోగ్రాం (ఆర్‌బీపీ)లో భాగంగా తొలుత జిల్లాలో 50 గ్రామాలను ఎంపిక చేసి నాణ్యతా ప్రమాణాల పరిశీలన చేస్తామన్నారు. ఏపీ డెయిరీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
 
‘ప్రభుత్వ డెయిరీని కాపాడండి’
అనంతపురం అగ్రికల్చర్‌ : ‘‘వర్షాలు లేక, పంటలు పండక, బోర్లలో నీళ్లు రాక జిల్లాలో కరువు రాజ్యమేలుతోంది.  పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యామ్నాయ వనరుగా ఆదుకోవాల్సిన పాడి పరిశ్రమ కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ డెయిరీ పాల ధరలు బాగా తగ్గించడంతో దాన్ని నమ్ముకున్న రైతు కుటుంబాలు, పేదల పరిస్థితి దారుణంగా ఉంది. మరోపక్క ప్రైవేట్‌ డెయిరీలు ఆధిపత్యం కొనసాగుతోన్నా ముకుతాడు వేసేవాళ్లు లేకపోవడంతో ప్రభుత్వ డెయిరీని నమ్ముకున్న రైతులు నష్టపోతున్నారు’’ అని ఏపీ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) జే.మురళీ ఎదుట పాడిరైతుల సంఘం నాయకులు, సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం నాయకులు ఆవేదన వెళ్లబోసుకున్నారు. ఆయన శనివారం స్థానిక ఏపీ డెయిరీని సందర్శించి రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పాడి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ఏకరువు పెట్టారు. పాడి రైతుల సంఘం నాయకులు బిల్లే ఆదినారాయణ, గంగులకుంట కిష్ట, సుదర్శనరెడ్డి, కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సమస్యలు చెబుతూనే ఎండీని నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రైవేట్‌ డెయిరీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పాడి రైతులను వదిలేయడంతో కష్టాలు పడుతున్నారన్నారు. ధరలు గిట్టుబాటు కావడం లేదు, సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు, దాణా, గడ్డి, పశువుల వంటి పంపిణీ చేయలేదు, బీమా సదుపాయం లేదు, డెయిరీ ఉద్యోగుల నిర్లక్ష్యం తదితర సమస్యలు ఆయన ముందుంచారు. ప్రోత్సాహం అందిస్తే నాణ్యమైన పోలు పోయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

డెయిరీని అభివృద్ధి చేయడంతో పాటు అనుబంధంగా పెరుగు, పాలపౌడర్‌ తయారీ కంపెనీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పాలు జిల్లాలోనే అమ్మకాలు సాగిస్తే నష్టాలు తగ్గుతాయన్నారు. వచ్చే వారం బకాయిలు పూర్తీగా చెల్లిస్తామని, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పాల ధరలు పెంపు ఉంటుందని, పశుసంవర్ధకశాఖ తరఫున కాకుండా డెయిరీ ద్వారా పాడి రైతులకు సైలేజ్‌ గడ్డి, పశుదాణా పంపిణీ చేస్తామని, పశుబీమా అమలుపై దృష్టి పెడతానని ఎండీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలో పోల్చకుండా ‘అనంత’ను ప్రత్యేకంగా తీసుకుని అభివృద్ధి చేయడానికి రైతుల బాగోగులపై దృష్టి పెడతామని భరోసా ఇచ్చారు. డెయిరీ రైతుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement