ఖరీఫ్‌లో జొన్న, మొక్కజొన్న బాగు
– ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రవీంద్రనాథరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, ఎరువుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జొన్న: సీఎస్‌హెచ్–14, సీఎస్‌హెచ్–18, పీఎస్‌వీ–1, సీఎస్‌వీ–15, పాలెం–2 జొన్న రకాలు అనువైనవి. జూలై 15లోగా విత్తుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు అవసరం. సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు (సెం.మీ), మొక్కల మధ్య 12 నుంచి 15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోలు నత్రజని, 24 కిలోలు భాస్వరం, 20 కిలోలో పొటాష్ ఎరువు వేసుకోవాలి. నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తేసమయంలో, ఆ తర్వాత మోకాలు ఎత్తు పైరు ఉన్నపుడు రెండో సారి వేసుకోవాలి.
మొక్కజొన్న : డీహెచ్‌ఎం–11, డీహెచ్‌ఎం–113, డీహెచ్‌ఎం–115, డీహెచ్‌ఎం–117, డీహెచ్‌ఎం–119, డీహెచ్‌ఎం–121, ఆంబర్‌పాప్‌కార్న్, మాధురి, ప్రియా మొక్కజొన్న విత్తన రకాలు ఎంపిక చేసుకోవాలి. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు విత్తుకునేందుకు అనువైన సమయం. ఎకరాకు 8 కిలోలు విత్తనం అవసరం. సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎకరాకు 72 నుంచి 80 కిలోలు నత్రజని, 24 కిలోలు భాస్వరం, 20 కిలోలు పొటాష్ ఎరువు వేయాలి. నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తే సమయంలో సగం, విత్తుకున్న 30 రోజులకు రెండో సగం వేసుకోవాలి. నీటి పారుదల కింద అయితే నత్రజని ఎరువును నాలుగు భాగాలుగా చేసుకుని విత్తేసమయం, 25 నుంచి 30 రోజులు, 40 నుంచి 45 రోజులు, 60 నుంచి 65 రోజుల సమయంలో వేసుకోవాలి.