దానిమ్మలో సస్యరక్షణ చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదకరమైన బ్యాక్టీరియా మచ్చ తెగులు నుంచి దానిమ్మను కాపాడుకుంటే రైతులు అధిక ఆదాయం సాధించవచ్చని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో శుక్రవారం ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో దానిమ్మ తోటలపై రైతులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో శాస్త్రవేత్త హాజరై అవగాహన కల్పించారు.
బ్యాక్టీరియా తెగులు : దానిమ్మ తోటల్లో ఆకులు, కాండం, కాయలపై ఆశిస్తున్న బ్యాక్టీరియా మచ్చతెగులు వల్ల పంటకు నష్టం వాటిల్లుతోంది. ఈ తెగులు నర్సరీల నుంచి, వర్షంతో కూడిన గాలులు ద్వారా, కత్తిరింపులు చేసే సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. నర్సరీల్లో మొక్కల ఆకులు, లేత కొమ్మలపై నీటితో తడచినట్లు మచ్చలు కనిపిస్తే రోగం ఉన్నట్లుగా గుర్తించాలి. టిష్యూకల్చర్ మొక్కలు బాగున్నా వాటిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. గాలి అంట్లు శ్రేయస్కరం. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి కత్తిరింపులు జాగ్రత్తగా చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన కొమ్మలు, కాయలు, చెట్లు పీకేసి ఎప్పటికపుడు కాల్చివేయాలి. తోటలను ఎప్పుడూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి.
సాగు పద్ధతులు:
రోగరహిత మొక్కలు ఎంపిక చేసుకోవాలి. నాటే సమయంలో గుంతలు తీసిన తర్వాత ఎండుతెగులు, కొన్ని శిలీంధ్రాలు ఆశించకుండా 3 మి.లీ క్లోరోఫైరిపాస్+ 2 గ్రాములు బావిస్టన్ లీటర్ నీటికి కలిపి గుంతలు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. గుంతల్లో పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, సింగిల్ సూపర్‌ఫాస్పేట్, ట్రై కోడెర్మావిరిడీ, అజోస్రై రిల్లమ్ వేసి నాటుకోవాలి. మొక్కల మధ్య 10 అడుగులు, వరుసల మధ్య 12 నుంచి 13 అడుగుల దూరంలో ఎకరాకు 800 మొక్కలు నాటుకోవాలి. నాటిన కొన్ని రోజులకు మొక్కకు వచ్చే కాండాల్లో మూడు నుంచి నాలుగు కాండాలు వదిలి మిగిలినవి కత్తిరించేయాలి. భూమి నుంచి రెండడుగులు ఎత్తు వరకు పక్క కొమ్మలను లేకుండా చూసుకోవాలి.
చెట్ల పాదుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. కత్తిరింపుల తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. లేత చిగుర్లు వచ్చిన తర్వాత జింక్, బోరాన్, మెగ్నీషియం తదితర ధాతులోపాల నివారణకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులుకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే 25 గ్రాములు బ్లైటాక్స్ + 5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు 0.3 గ్రాములు అసిటమాప్రిడ్ (ప్రైడ్) లేదా 2 మి.లీ రీజెంట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయలపై శిలీంద్ర మచ్చ తెగులు కనిపిస్తే బావిస్టన్ లేదా టిల్ట్ లేదా స్కోర్ లేదా అవతార్ లేదా మెర్జర్ లాంటి మందులు మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తే 3 మి.లీ క్లోరోఫైరిఫాస్ + 2 గ్రాములు బావిస్టన్ లీటర్ నీటికి కలిపి చెట్ల పాదుల్లో పోయాలి.