danimma
-
దానిమ్మతో దీర్ఘాయుష్షు, ఇలా తిన్నారంటే..!
చాలా మంది మనసులో మెదిలే ఆలోచన ‘దీర్ఘకాలం జీవించాలి. ఆ జీవనం కూడా వీలైనంతవరకు ఆరోగ్యంగా, వృద్ధాప్యం దరిచేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచన మీది కూడా అయితే మన శరీర కణాల ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లతో ఆయుష్షును పెంచుకోవచ్చు.ఎలా అంటే... కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరానికి సహజంగా అవసరమైన వాటిని సరఫరా చేస్తాయి. ఈ సీజన్లో దానిమ్మపండ్లు (సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు) విరివిగా లభిస్తాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలిస్తే ప్రతిరోజూ ఆహారంలో వీటిని తప్పక చేరుస్తారు. చర్మానికి మేలు..దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి మెదడు నుండి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానికీ మద్దతు ఇస్తాయని పరిశోధనలలో తేలింది. డాక్టర్ విసెంటె మేరా తన ‘యంగ్ ఎట్ ఏ ఏజ్’ అనే పుస్తకంలో ‘దానిమ్మపండు దాని యాంటీఆక్సిడెంట్ శక్తి కారణంగా చర్మానికి మేలు చేసే సూపర్‌ఫుడ్’ అని పేర్కొన్నారు. దానిమ్మపండులో విటమిన్– సి పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ‘శరీరానికి విటమిన్– సి అందినప్పుడు, కొల్లాజెన్ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉత్తేజితమవుతుంది. అంతర్గత సన్స్క్రీన్దానిమ్మ జ్యూస్ తాగితే యూవీ కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నుండి చర్మాన్ని రక్షించవచ్చు. ఇది దాదాపు ‘అంతర్గత సన్‌స్క్రీన్‘ లా పనిచేస్తుంది. మెదడుకు దానిమ్మదానిమ్మలోని విటమిన్ బి5 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. దానిమ్మ రసం నుండి వచ్చే ఫైటోన్యూట్రియెంట్లు మెదడుపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి‘ అని యుసిఎల్ఎ హెల్త్ నోట్ పరిశోధకులు పేర్కొన్నారు.చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‘చెడు‘ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టిజి, ఎల్డిఎల్ అండ్ సి, హెచ్‌డిఎల్, సి స్థాయిలను మెరుగుపరచడంలో దానిమ్మ వినియోగం ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతర ఒత్తిడి వల్ల వృద్ధాప్యం త్వరగా ప్రవేశిస్తుంది. ఒత్తిడి తగ్గించడంలోనూ, నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలోనూ కాలానుగుణంగా లభించే దానిమ్మ సరైనది. ఎలా తినాలంటే... దానిమ్మ గింజలు కొన్ని రకాల వంటకాలకు, సలాడ్స్‌కు మంచి రుచిని తీసుకువస్తాయి. ఉదయం టిఫిన్‌తో పాటుగా దానిమ్మ గింజలను తినవచ్చు. అవకాడో, పిస్తాతో కలిపి చేసిన సలాడ్స్‌లోనూ చేర్చవచ్చుఅవిసె గింజలు, పెరుగుతోనూ కలిపి తినవచ్చు. ఉడికించిన కూరగాయలపైన పెరుగు, దానిమ్మ గింజలు వేసుకొని తినవచ్చు. దానిమ్మ పండును కడగాల్సిన అవసరం లేదు. గింజలను వేరు చేసి, తినవచ్చు. -
దానిమ్మకు బ్యాక్టీరియా
మారిన వాతావరణంతో తెగులు ఉధృతి సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి చంద్రశేఖర్ అనంతపురం అగ్రికల్చర్: వాతావరణంలో అనూహ్య మార్పులు రావడంతో జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న దానిమ్మ తోటల్లో బ్యాక్టీరియా వైరస్ తెగులు వ్యాప్తి చెందిందనీ, సస్యరక్షణ చర్యలతో నివారించుకోవాలని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్ తెలిపారు. లేదంటే దానిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రమాదకరం బ్యాక్టీరియా మచ్చ తెగులు దానిమ్మ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది ఏ దశలోనైనా వ్యాపించి పంటకు తీరని నష్టం కలిగిస్తుంది. కొమ్మలు, కాండం, ఆకులు, కాయలపై నల్లని మచ్చలు ఏర్పడి దెబ్బతీస్తుంది. తోటలు శుభ్రంగా పెట్టుకోవడం, కత్తిరించిన కొమ్మలు, రెమ్మలను పూర్తిగా ఏరివేసి నాశనం చేసుకోవాలి. వాటి అవశేషాలు తోట పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకూడదు. ఒక చెట్టు నుంచి మరొకచెట్టుకు తెగులు వేగంగా వ్యాప్తి చెంది దిగుబడులను దారుణంగా దెబ్బతీస్తుంది. మారిన వాతావరణం నాలుగు వారాలుగా గాలిలో తేమశాతం పెరిగింది, ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. మధ్యలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నపుడు బ్యాక్టీరియా మచ్చ తెగులు అతివేగంగా వ్యాప్తిచెందుతుంది. లక్షణాలు తొలుత ఆకులపై నల్లమచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత పసుపు రంగులోకి మారి ఆకు ఎండిపోతుంది. కొమ్మలు, కాండం వద్ద మచ్చలు ఏర్పడి తర్వాత విరిగిపోతాయి. కాయపై పగుళ్లు ఏర్పడి పగిలిపోతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 వేల హెక్టార్ల దానిమ్మ సాగులో ఉండగా... కొన్ని పూత దశలో, మరికొన్ని కాయ ఎదుగుదశలో ఉన్నాయి. ఎక్కువ తోటలలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణ చర్యలు పూత దశలో ఉన్న తోటలకు 1 గ్రాము కాపర్హైడ్రాక్సైడ్ + 0.5 గ్రాము బ్యాక్ట్రిమైసిన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కత్తిరింపులు చేపట్టిన తోటల్లో వెంటనే 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. కాయ ఎదుగుదల దశలో ఉన్న తోటల్లో 0.5 శాతం బోర్డోమిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. రసాయన ఎరువుల తగ్గించాలి. తెగులు సోకిన కొమ్మలు, కాయలు తీసేయాలి. ప్రస్తుతం అంతర సేద్యం చేయకపోవడమే మేలు. లేదంటే ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు తెగులు సులభంగా వ్యాపిస్తుంది. డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు ఎండ తీవ్రత, నేల స్వభావాన్ని బట్టి రోజు మార్చి రోజు ఒకటిన్నర గంట పాటు నీటి తడి ఇవ్వాలి. చెట్టుకు ఇరువైపులా డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకోవాలి. గడ్డి ఉన్నప్పటికీ...ఇపుడు తొలగించకూడదు. వర్షం వచ్చినా తెగులు వ్యాప్తిని అరికడుతుంది. చెట్ల పాదుల్లో బట్టిసున్నం+ బ్లీచింగ్ పౌడరు చల్లుకుంటే భూమిపై ఉండే బ్యాక్టీరియాను నివారించుకోవచ్చు. -
జాగ్రత్తలు పాటిస్తే లాభాల పంట
అనంతపురం అగ్రికల్చర్: జాగ్రత్తలు పాటిస్తే దానిమ్మ లాభాల పంట అని రేకులకుంటలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. బ్యాక్టీరియా మచ్చ తెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే దానిమ్మ పంట రైతుకు లాభదాయకమని అన్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్గుప్త ఆధ్వర్యంలో దానిమ్మ సాగు యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాసులు, డాక్టర్ దీప్తి, డాక్టర్ రాజేశ్వరి హాజరై అవగాహన కల్పించారు. యాజమాన్య పద్ధతులు: జిల్లాలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మ్రిగ్బహార్ (వర్షాకాలపు పూత), మరికొన్ని ప్రాంతాల్లో హస్తబహార్ (చలికాలంలో పూత) పద్ధతిలో దానిమ్మ సాగులో ఉంది. హస్తబహార్ కింద చేపట్టిన దానిమ్మలో ఆకులు పూర్తిగా రాలిపోవాలంటే 2.5 మి.లీ ఇథరిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రాలిన ఆకులన్నీ పూర్తిగా తీసేసి నాశనం చేయాలి. తర్వాత ఎకరాకు 6 నుంచి 7 కిలోలు బ్లీచింగ్‌పౌడర్ చల్లాలి. ఆకులు రాలిన 20 రోజల తర్వాత జాగ్రత్తగా కొమ్మలు కత్తిరించాలి. అలాగే పాదులు తవ్వి, సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేసి నీటి తడులు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కొత్త ఇగుర్లు, పూత బాగా వస్తుంది. చలికాలం పంటకు బ్యాక్టీరియా తెగులు వ్యాప్తి తక్కువగానే ఉంటుంది. అదే మ్రిగ్బహార్ కింద వర్షాకాలపు పంటకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ తెగులు కనిపిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు సోకిన కొమ్మలు, కాయలు కత్తిరించి నాశనం చేయాలి. ఈ తెగులు నివారణకు తొలిదశలో 1 గ్రాము బావిస్టన్ + 0.5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ + 3 గ్రాములు స్టెప్టోసైక్లీన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయతొలిచే సీతాకోకచిలుక: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాధారణంగా కాయతొలిచే సీతాకోక చిలుక ఆశించే అవకాశం ఉన్నందున పొలంగట్లు పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు ముఖ్యంగా తిప్పతీగ మొక్కలు లేకుండా నాశనం చేయాలి. రాత్రిళ్లు టార్చిలైటు వేసి చిలుక ఉనికి, ఉధృతి తెలుసుకొని అందుబాటులో ఉంటే వలల ద్వారా వాటిని నివారించుకోవచ్చు. లేదంటే దానిమ్మరసం, బెల్లం, కార్భోఫ్యూరాన్ గుళికలతో తయారు చేసి విషపు ఎరలు పొలంలో అక్కడ ఉంచితే వాటికి ఆకర్షించి చనిపోతాయి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో తామర పురుగులు, పేనుబంక, కాయతొలిచే పురుగు ఆశించే అవకాశం ఉన్నందున 2 మి.లీ పిప్రోనిల్ లేదా 2 మి.లీ థయోమిథాక్సామ్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మూడు సంవత్సరాలు దాటిన దానిమ్మ మొక్కలకు ప్రస్తుతం రోజుమార్చి రోజు ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు కిలోలు 19–19–19, అలాగే ఒకటిన్నర కిలోలు 13–0–45 మందులు డ్రిప్ ద్వారా అందజేయాలి. -
దానిమ్మలో సస్యరక్షణ చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదకరమైన బ్యాక్టీరియా మచ్చ తెగులు నుంచి దానిమ్మను కాపాడుకుంటే రైతులు అధిక ఆదాయం సాధించవచ్చని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో శుక్రవారం ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో దానిమ్మ తోటలపై రైతులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో శాస్త్రవేత్త హాజరై అవగాహన కల్పించారు. బ్యాక్టీరియా తెగులు : దానిమ్మ తోటల్లో ఆకులు, కాండం, కాయలపై ఆశిస్తున్న బ్యాక్టీరియా మచ్చతెగులు వల్ల పంటకు నష్టం వాటిల్లుతోంది. ఈ తెగులు నర్సరీల నుంచి, వర్షంతో కూడిన గాలులు ద్వారా, కత్తిరింపులు చేసే సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. నర్సరీల్లో మొక్కల ఆకులు, లేత కొమ్మలపై నీటితో తడచినట్లు మచ్చలు కనిపిస్తే రోగం ఉన్నట్లుగా గుర్తించాలి. టిష్యూకల్చర్ మొక్కలు బాగున్నా వాటిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. గాలి అంట్లు శ్రేయస్కరం. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి కత్తిరింపులు జాగ్రత్తగా చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన కొమ్మలు, కాయలు, చెట్లు పీకేసి ఎప్పటికపుడు కాల్చివేయాలి. తోటలను ఎప్పుడూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి. సాగు పద్ధతులు: రోగరహిత మొక్కలు ఎంపిక చేసుకోవాలి. నాటే సమయంలో గుంతలు తీసిన తర్వాత ఎండుతెగులు, కొన్ని శిలీంధ్రాలు ఆశించకుండా 3 మి.లీ క్లోరోఫైరిపాస్+ 2 గ్రాములు బావిస్టన్ లీటర్ నీటికి కలిపి గుంతలు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. గుంతల్లో పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, సింగిల్ సూపర్‌ఫాస్పేట్, ట్రై కోడెర్మావిరిడీ, అజోస్రై రిల్లమ్ వేసి నాటుకోవాలి. మొక్కల మధ్య 10 అడుగులు, వరుసల మధ్య 12 నుంచి 13 అడుగుల దూరంలో ఎకరాకు 800 మొక్కలు నాటుకోవాలి. నాటిన కొన్ని రోజులకు మొక్కకు వచ్చే కాండాల్లో మూడు నుంచి నాలుగు కాండాలు వదిలి మిగిలినవి కత్తిరించేయాలి. భూమి నుంచి రెండడుగులు ఎత్తు వరకు పక్క కొమ్మలను లేకుండా చూసుకోవాలి. చెట్ల పాదుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. కత్తిరింపుల తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. లేత చిగుర్లు వచ్చిన తర్వాత జింక్, బోరాన్, మెగ్నీషియం తదితర ధాతులోపాల నివారణకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులుకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే 25 గ్రాములు బ్లైటాక్స్ + 5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు 0.3 గ్రాములు అసిటమాప్రిడ్ (ప్రైడ్) లేదా 2 మి.లీ రీజెంట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయలపై శిలీంద్ర మచ్చ తెగులు కనిపిస్తే బావిస్టన్ లేదా టిల్ట్ లేదా స్కోర్ లేదా అవతార్ లేదా మెర్జర్ లాంటి మందులు మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తే 3 మి.లీ క్లోరోఫైరిఫాస్ + 2 గ్రాములు బావిస్టన్ లీటర్ నీటికి కలిపి చెట్ల పాదుల్లో పోయాలి. -
మొన్న గలగల.. నేడు విలవిల
- అమాంతం పడిపోయిన రేట్లు - పండ్లలో నాణ్యతా లోపం - కష్టాల్లో దానిమ్మ రైతులు మొన్నటి వరకు సిరులు కురిపించిన దానిమ్మ.. నేడు రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. పండ్లలో నాణ్యత లోపించడం, అమాంతం ధర పడిపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పెట్టుబడులు కూడా తిరిగిరాకపోవడంతో రైతులు డీలా పడిపోయారు. పెద్దపప్పూరు : తాడిపత్రి నియోజకవర్గంలో నెలక్రితం వరకు వీచిన వేడిగాలులు, ఎండలు దానిమ్మ రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వేడిగాలులు, ఎండల కారణంగా దానిమ్మ దిగుబడులు సగానికి పైగా తగ్గడం తో పాటు చాలా వరకు నాణ్యత లోపించాయి. దీంతో రైతులు పండ్లను మార్కెట్ చేయలేకపోతున్నారు. ఎండలకు దానిమ్మ పండు లోపల ఎర్రగా ఉండాల్సిన విత్తనాలు నల్లగా మారడంతో రైతులు పండ్లను మార్కెట్లకు తీసుకెళ్లలేని పరిస్థితి. చేసేది లేక నాణ్యతలేని పండ్లను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. వెనక్కిరాని పెట్టుబడులు దానిమ్మ సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదు. మండలంలోని అమ్మలదిన్నె, జె.కొత్తపల్లి, నారాపురం, నామనాంకపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో రైతులు మృదులా, భగవ రకాలను సాగు చేశారు. ఎకరా దానిమ్మ పంటను సాగు చేయడానికి లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. దానిమ్మను ఒక్కసారి సాగుచేస్తే దాదాపు 20 సంవత్సరాల వరకు దిగుబడులు అందుతాయి. మొక్కలు నాటిని రెండో సంవత్సరం నుండి దిగుబడులు తీసుకొవచ్చు. ఎకరా తోటలో దాదాపు 15 నుండి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే వేడిగాలుల దెబ్బకు ఈసారి కేవలం 6 నుండి 8 టన్నులకు పడిపోయింది. నాణ్యత లోపించడంతో మార్కెట్ రేట్లు తీవ్ర వ్యత్యాసం ఉంది. గత రెండు మూడు సంవత్సరాలు ఇదే సమయంలో టన్ను దానిమ్మ ధర రూ.50 వేల వరకు పలికింది. అయితే ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి పలుకకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన డిసెంబర్, జనవరి నెలలో టన్ను రూ. 90 వేలు పలకడం విశేషం. ప్రభుత్వమే ఆదుకొవాలి గత వేసవిలో వీచిన వేడిగాలులు, ఎండ వేడికి దానిమ్మ దిగుబడి సగానికి పైగా తగ్గింది. నాణ్యత లోపించింది. దీంతో మార్కెట్లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ప్రభుత్వమే మమల్ని ఆదుకొవాలి. - వెంకటనారాయణ, దానిమ్మ రైతు, జె.కొత్తపల్లి బోర్లు వేసినా నీరు పడలేదు నాలుగు ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశాను. గత ఏడాది బోరులో నీరు రాకపోవడంతో వరుసగా నాలుగు బోర్లు వేశాను. చుక్కనీరు రాలేదు. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. నష్టపోతున్నాం. ప్రభుత్వమే రైతులను ఆదుకొవాలి. - నారాయణ, దానిమ్మ రైతు జె.కొత్తపల్లి -
ప్రధాన వాణిజ్య పంట
అనంతపురం అగ్రికల్చర్ : ఇటీవల దానిమ్మ తోటలు జిల్లాలో ప్రధాన వాణిజ్యపంటగా రైతులను ఆర్థికంగా గట్టెక్కిస్తున్నాయని ఉద్యానశాఖ టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్ తెలిపారు. అయితే కొందరు సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడంతో నష్టపోతున్నారు. ప్రధానంగా తోటలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే తెగుళ్లు, రోగాలను అంత దూరం చేసుకోవచ్చని తెలిపారు. దానిమ్మకు అనుకూలం.. భూభౌగోళిక నైసర్గిక పరంగా జిల్లాలో అన్ని రకాల నేలలు దానిమ్మ తోటలకు అనుకూలం. గణేష్, మదుల, భగువ రకాలు ఎంచుకోవాలి. నాటే సమయంలో 20 కిలోల పశువుల ఎరువు, కిలో సూపర్ ఫాస్ఫేట్, 2 శాతం లిండేన్ పొడిని మట్టితో కలిపి గుంతలు నింపాలి. గాలి అంట్లు, నేల అంట్లు లేదా కొమ్మల ప్రవర్ధనం ద్వారా వచ్చిన మొక్కలను నాటుకోవాలి. 50–70 రోజుల్లో అంట్లు వేర్లు నాటేందుకు అనుకూలం. చెట్టు వయస్సును బట్టి పశువుల ఎరువు, వేపపిండి, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడాలి. సూక్ష్మధాతు లోపాల సవరణ.. జింకు లోపం ఏర్పడితే ఆకుల పరిమాణం చిన్నదిగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. లీటరు నీటికి 5 గ్రాముల జింకు సల్ఫేటును కలిపి 1–2 సార్లు కొత్త చిగురు ఉన్నప్పుడు పిచికారి చేయాలి. పెర్రస్(ఇనుము) ధాతువు లోపించిన ఆకులు తెల్లబడతాయి. నివారణకు 2.5 గ్రాముల పెర్రస్ సల్ఫేట్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్నా... బోరాన్ లోపించనపుడు లేత కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. నివారణకు 12.5 గ్రాముల బోరాక్సును పాదులకు వేయాలి. లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్సును కలిపి పిచికారి చేయాలి. ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలినవి కత్తిరించాలి. నేలకు తగిలే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మలను కత్తిరించాలి. డ్రిప్ ద్వారా నీటి సదుపాయం క్రమపద్ధతిలో ఇవ్వాలి. కాయతొలిచే పురుగు, బెరడు తినే పురుగులు, తామరపురుగులు, పేనుబంక నివారణ చర్యలు చేపట్టాలి. మచ్చ తెగులు ప్రమాదకరం: బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే మచ్చతెగులు 27 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 70 శాతం పైగా గాలిలో తేమశాతం ఉండే జూలై నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా కనిపిస్తుంది. వేసవిలో కురిసే వర్షాల వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులు కూడా ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన చెట్లకు అంట్లు కట్టుట వలన నర్సీరీ దశలోనే వ్యాప్తి చెందుతుంది. ఆకులపైన, కొమ్మలపైన, పిందెలపైన నీటిలో తడిచిన మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు అధికమై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు రాలిపోవడం, కొమ్మలు కణుపుల వద్ద విరిగిపోవడం, కాయలపై మచ్చలు నలుపు రంగులోకి మారి వాటిపై ‘వై’ లేదా ఎల్’ ఆకారపు నెరియలు ఏర్పడుతాయి. మొదట్లోనే రోగరహిత మొక్కలు నాటుకోవాలి. తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం కింది వరకు కత్తిరించి కాల్చి వేయాలి. కత్తిరింపు సమయంలో వాడే కత్తెరలను ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి ఉపయోగించాలి. వీటి కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపులు అయిన వెంటనే ఒక శాతం బోర్డో మిశ్రమమును పిచికారి చేసుకోవాలి.