జాగ్రత్తలు పాటిస్తే లాభాల పంట | agriculture story | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు పాటిస్తే లాభాల పంట

Published Thu, Aug 31 2017 9:46 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

జాగ్రత్తలు పాటిస్తే లాభాల పంట - Sakshi

జాగ్రత్తలు పాటిస్తే లాభాల పంట

అనంతపురం అగ్రికల్చర్‌: జాగ్రత్తలు పాటిస్తే దానిమ్మ లాభాల పంట అని రేకులకుంటలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. బ్యాక్టీరియా మచ్చ తెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే దానిమ్మ పంట రైతుకు లాభదాయకమని అన్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గుప్త ఆధ్వర్యంలో దానిమ్మ సాగు యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాసులు, డాక్టర్‌ దీప్తి, డాక్టర్‌ రాజేశ్వరి హాజరై అవగాహన కల్పించారు.

యాజమాన్య పద్ధతులు:
    జిల్లాలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మ్రిగ్‌బహార్‌ (వర్షాకాలపు పూత), మరికొన్ని ప్రాంతాల్లో హస్తబహార్‌ (చలికాలంలో పూత) పద్ధతిలో దానిమ్మ సాగులో ఉంది. హస్తబహార్‌ కింద చేపట్టిన దానిమ్మలో ఆకులు పూర్తిగా రాలిపోవాలంటే 2.5 మి.లీ ఇథరిల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రాలిన ఆకులన్నీ పూర్తిగా తీసేసి నాశనం చేయాలి. తర్వాత ఎకరాకు 6 నుంచి 7 కిలోలు బ్లీచింగ్‌పౌడర్‌ చల్లాలి. ఆకులు రాలిన 20 రోజల తర్వాత జాగ్రత్తగా కొమ్మలు కత్తిరించాలి. అలాగే పాదులు తవ్వి, సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేసి నీటి తడులు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కొత్త ఇగుర్లు, పూత బాగా వస్తుంది. చలికాలం పంటకు బ్యాక్టీరియా తెగులు వ్యాప్తి తక్కువగానే ఉంటుంది. అదే మ్రిగ్‌బహార్‌ కింద వర్షాకాలపు పంటకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ తెగులు కనిపిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు సోకిన కొమ్మలు, కాయలు కత్తిరించి నాశనం చేయాలి. ఈ తెగులు నివారణకు తొలిదశలో 1 గ్రాము బావిస్టన్‌ + 0.5 గ్రాములు స్టెప్టోసైక్లీన్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 30 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ + 3 గ్రాములు స్టెప్టోసైక్లీన్‌ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

కాయతొలిచే సీతాకోకచిలుక:
     సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో సాధారణంగా కాయతొలిచే సీతాకోక చిలుక ఆశించే అవకాశం ఉన్నందున పొలంగట్లు పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు ముఖ్యంగా తిప్పతీగ మొక్కలు లేకుండా నాశనం చేయాలి. రాత్రిళ్లు టార్చిలైటు వేసి చిలుక ఉనికి, ఉధృతి తెలుసుకొని అందుబాటులో ఉంటే వలల ద్వారా వాటిని నివారించుకోవచ్చు. లేదంటే దానిమ్మరసం, బెల్లం, కార్భోఫ్యూరాన్‌ గుళికలతో తయారు చేసి విషపు ఎరలు పొలంలో అక్కడ ఉంచితే వాటికి ఆకర్షించి చనిపోతాయి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో తామర పురుగులు, పేనుబంక, కాయతొలిచే పురుగు ఆశించే అవకాశం ఉన్నందున 2 మి.లీ పిప్రోనిల్‌ లేదా 2 మి.లీ థయోమిథాక్సామ్‌ లేదా 2 మి.లీ డైమిథోయేట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మూడు సంవత్సరాలు దాటిన దానిమ్మ మొక్కలకు ప్రస్తుతం రోజుమార్చి రోజు ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు కిలోలు 19–19–19, అలాగే ఒకటిన్నర కిలోలు 13–0–45 మందులు డ్రిప్‌ ద్వారా అందజేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement