దానిమ్మకు బ్యాక్టీరియా
మారిన వాతావరణంతో తెగులు ఉధృతి
సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి చంద్రశేఖర్
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణంలో అనూహ్య మార్పులు రావడంతో జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న దానిమ్మ తోటల్లో బ్యాక్టీరియా వైరస్ తెగులు వ్యాప్తి చెందిందనీ, సస్యరక్షణ చర్యలతో నివారించుకోవాలని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్ తెలిపారు. లేదంటే దానిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రమాదకరం
బ్యాక్టీరియా మచ్చ తెగులు దానిమ్మ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది ఏ దశలోనైనా వ్యాపించి పంటకు తీరని నష్టం కలిగిస్తుంది. కొమ్మలు, కాండం, ఆకులు, కాయలపై నల్లని మచ్చలు ఏర్పడి దెబ్బతీస్తుంది. తోటలు శుభ్రంగా పెట్టుకోవడం, కత్తిరించిన కొమ్మలు, రెమ్మలను పూర్తిగా ఏరివేసి నాశనం చేసుకోవాలి. వాటి అవశేషాలు తోట పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకూడదు. ఒక చెట్టు నుంచి మరొకచెట్టుకు తెగులు వేగంగా వ్యాప్తి చెంది దిగుబడులను దారుణంగా దెబ్బతీస్తుంది.
మారిన వాతావరణం
నాలుగు వారాలుగా గాలిలో తేమశాతం పెరిగింది, ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. మధ్యలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నపుడు బ్యాక్టీరియా మచ్చ తెగులు అతివేగంగా వ్యాప్తిచెందుతుంది.
లక్షణాలు
తొలుత ఆకులపై నల్లమచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత పసుపు రంగులోకి మారి ఆకు ఎండిపోతుంది. కొమ్మలు, కాండం వద్ద మచ్చలు ఏర్పడి తర్వాత విరిగిపోతాయి. కాయపై పగుళ్లు ఏర్పడి పగిలిపోతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 వేల హెక్టార్ల దానిమ్మ సాగులో ఉండగా... కొన్ని పూత దశలో, మరికొన్ని కాయ ఎదుగుదశలో ఉన్నాయి. ఎక్కువ తోటలలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలి.
నివారణ చర్యలు
పూత దశలో ఉన్న తోటలకు 1 గ్రాము కాపర్‌హైడ్రాక్సైడ్ + 0.5 గ్రాము బ్యాక్ట్రిమైసిన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కత్తిరింపులు చేపట్టిన తోటల్లో వెంటనే 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. కాయ ఎదుగుదల దశలో ఉన్న తోటల్లో 0.5 శాతం బోర్డోమిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. రసాయన ఎరువుల తగ్గించాలి. తెగులు సోకిన కొమ్మలు, కాయలు తీసేయాలి. ప్రస్తుతం అంతర సేద్యం చేయకపోవడమే మేలు. లేదంటే ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు తెగులు సులభంగా వ్యాపిస్తుంది. డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు ఎండ తీవ్రత, నేల స్వభావాన్ని బట్టి రోజు మార్చి రోజు ఒకటిన్నర గంట పాటు నీటి తడి ఇవ్వాలి. చెట్టుకు ఇరువైపులా డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకోవాలి. గడ్డి ఉన్నప్పటికీ...ఇపుడు తొలగించకూడదు. వర్షం వచ్చినా తెగులు వ్యాప్తిని అరికడుతుంది. చెట్ల పాదుల్లో బట్టిసున్నం+ బ్లీచింగ్ పౌడరు చల్లుకుంటే భూమిపై ఉండే బ్యాక్టీరియాను నివారించుకోవచ్చు.