మొన్న గలగల.. నేడు విలవిల
- అమాంతం పడిపోయిన రేట్లు
- పండ్లలో నాణ్యతా లోపం
- కష్టాల్లో దానిమ్మ రైతులు
మొన్నటి వరకు సిరులు కురిపించిన దానిమ్మ.. నేడు రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. పండ్లలో నాణ్యత లోపించడం, అమాంతం ధర పడిపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పెట్టుబడులు కూడా తిరిగిరాకపోవడంతో రైతులు డీలా పడిపోయారు.
పెద్దపప్పూరు : తాడిపత్రి నియోజకవర్గంలో నెలక్రితం వరకు వీచిన వేడిగాలులు, ఎండలు దానిమ్మ రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వేడిగాలులు, ఎండల కారణంగా దానిమ్మ దిగుబడులు సగానికి పైగా తగ్గడం తో పాటు చాలా వరకు నాణ్యత లోపించాయి. దీంతో రైతులు పండ్లను మార్కెట్ చేయలేకపోతున్నారు. ఎండలకు దానిమ్మ పండు లోపల ఎర్రగా ఉండాల్సిన విత్తనాలు నల్లగా మారడంతో రైతులు పండ్లను మార్కెట్‌లకు తీసుకెళ్లలేని పరిస్థితి. చేసేది లేక నాణ్యతలేని పండ్లను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు.
వెనక్కిరాని పెట్టుబడులు
దానిమ్మ సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదు. మండలంలోని అమ్మలదిన్నె, జె.కొత్తపల్లి, నారాపురం, నామనాంకపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో రైతులు మృదులా, భగవ రకాలను సాగు చేశారు. ఎకరా దానిమ్మ పంటను సాగు చేయడానికి లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. దానిమ్మను ఒక్కసారి సాగుచేస్తే దాదాపు 20 సంవత్సరాల వరకు దిగుబడులు అందుతాయి. మొక్కలు నాటిని రెండో సంవత్సరం నుండి దిగుబడులు తీసుకొవచ్చు. ఎకరా తోటలో దాదాపు 15 నుండి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే వేడిగాలుల దెబ్బకు ఈసారి కేవలం 6 నుండి 8 టన్నులకు పడిపోయింది. నాణ్యత లోపించడంతో మార్కెట్ రేట్లు తీవ్ర వ్యత్యాసం ఉంది. గత రెండు మూడు సంవత్సరాలు ఇదే సమయంలో టన్ను దానిమ్మ ధర రూ.50 వేల వరకు పలికింది. అయితే ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి పలుకకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన డిసెంబర్, జనవరి నెలలో టన్ను రూ. 90 వేలు పలకడం విశేషం.
ప్రభుత్వమే ఆదుకొవాలి
గత వేసవిలో వీచిన వేడిగాలులు, ఎండ వేడికి దానిమ్మ దిగుబడి సగానికి పైగా తగ్గింది. నాణ్యత లోపించింది. దీంతో మార్కెట్‌లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ప్రభుత్వమే మమల్ని ఆదుకొవాలి.
- వెంకటనారాయణ, దానిమ్మ రైతు, జె.కొత్తపల్లి
బోర్లు వేసినా నీరు పడలేదు
నాలుగు ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశాను. గత ఏడాది బోరులో నీరు రాకపోవడంతో వరుసగా నాలుగు బోర్లు వేశాను. చుక్కనీరు రాలేదు. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. నష్టపోతున్నాం. ప్రభుత్వమే రైతులను ఆదుకొవాలి.
- నారాయణ, దానిమ్మ రైతు జె.కొత్తపల్లి