మహిళలపై పెరుగుతున్న దాడులు
విస్సన్నపేట : మహిళలపై దాడులు అరికట్టాలని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి టి.అరుణ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఐఫ్వా 4వ జిల్లా మహాసభ ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న శ్రామిక మహిళలు తక్కువ వేతనాలతో కుటుంబాన్ని మోస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. సమస్యలకోసం పోరాడుతుంటే ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. బెల్టు షాపులపై చర్యలు లేవని ఆరోపించారు. మహాసభలో ఐఫ్వా నాయకురాలు మేకల కుమారి, పద్మ, కళావతి, జమలమ్మ, అమల పాల్గొన్నారు.