విస్సన్నపేటలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం
సాక్షి, విస్సన్నపేట (కృష్ణా): మండల కేంద్రమైన విస్సన్నపేట మార్కెట్‌యార్డు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం వేసి మూడు నెలలు కావస్తున్నా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క రైతుకు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు వరకు రావాల్సి ఉందని మూడు నెలలు అయినా నగదు చేతికి అందక పోతే ఇప్పుడు మరలా వ్యవసాయానికి పెట్టుబడులు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వమే ఇలాచేస్తే ఎలా...
ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేదు, దళారుల చేతిలో మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ఇంతవరకు ఖాతాల్లో నగదు పడలేదని ఆవేదన చెందుతున్నారు. తమకు రావాల్సిన నగదు త్వరగా అందిస్తే మరలా వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టుకుంటామని అంటున్నారు. కాగా విస్సన్నపేట కొనుగోలు కేంద్రం నుంచి రూ.2 కోట్లు రైతుల ఖాతాల్లో నగదు జమకావాల్సి ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలుపుతున్నారు. ఈ మేరకు సివిల్ సప్లాయ్ డీటీ నాగజ్యోతిని వివరణ కోరగా నగదు చెల్లించాల్సిన రైతులందరి బిల్లులు ఆన్‌లైన్ చేయడం జరిగిందని రోజుకు కొంత మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని, త్వరలో మిగతా రైతులకు నగదు జమ అవుతాయన్నారు.
మూడు నెలలు దాటింది...
ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం అమ్మి మూడు నెలలు దాటింది. నేటికీ రూ.ఒక్కరూపాయి బ్యాంకు ఖాతాలో జమ కాలేదు, రూ.2 లక్షల వరకు మాకు నగదు రావాల్సి ఉంది, ఇంత మొత్తం నెలలు తరబడి ఇవ్వక పోతే మరలా వ్యవసాయానికి పెట్టుబడులు ఎలా వస్తాయి.
- కట్టా రవి, రైతు, మోతేరావుపేట
Comments
Please login to add a commentAdd a comment