అప్రమత్తమైన పోలీసులు
మంత్రులు, నేతలకు భద్రత పెంపు
విశాఖపట్నం : ఏవోబీలో ఎన్‌కౌంటర్‌తో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమ య్యారు. ముఖ్య రాజకీయనాయకులు, అధికారులకు భద్రత పెంచారు. ఎన్‌కౌంటర్‌లో 24 మంది మృతి చెందడంతో మావోలు ఏ క్షణమైనా ఎదురుదాడికి తెగపడే అవకాశాలుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బాకై ్సట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందన్న భావనతో మంత్రి అయ్యన్నపాత్రుడు, ఏజెన్సీలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు భద్రత కల్పించారు. తాజా ఘటన నేపథ్యంలో వీరికి భధ్రతను మరింత పెంచారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు, అరకు ఎంపీ గీత, ఇటీవల టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులతోపాటు ఇతర టీడీపీ నేతలకు భద్రతను పెంచుతున్నట్టు పోలీస్ వర్గాలు ప్రకటించారుు. నర్సీపట్నంలోని మంత్రి అయ్యన్న అతని బంధువుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
అలాగే విశాఖలో మంత్రి అయ్యన్నతో పాటు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐటీడీఏ పీవో, ఓఎస్‌డీ తదితర ఏజెన్సీ ప్రాంత అధికారులతో పాటు కలెక్టర్, ఎస్పీలకు కూడా భద్రతను సమీక్షిస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిం చేలా చర్యలు చేపట్టారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సోమవారం నగరానికి వచ్చిన డీజీపీ సాంబశివరావు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.