తెగని తమ్ముళ్ల తగవు
తెగని తమ్ముళ్ల తగవు
Published Tue, Apr 25 2017 11:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– అరుపులు కేకలతో వాయిదా పడ్డ అంబాజీపేట మండల పార్టీ అధ్యక్ష ఎన్నిక
పి.గన్నవరం : అంబాజీపేట మండల టీడీపీ అధ్యక్ష పదవి కోసం పి.గన్నవరంలో మంగళవారం జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఆ పదవికోసం మండలంలోని రెండు వర్గాల పార్టీ నాయకులు పోటీ పడటంతో ఎవరికి ఇవ్వాలన్న దానిపై స్థానిక ఎమ్మెల్యేకి తలపోటుగా మారింది. ఆ పదవి తమకు కావాలంటే, తమకు కావాలని రెండు వర్గాల కార్యకర్తలు పెద్ద పెట్టున కేకలు వేయడంతో.. చివరికి పార్టీ పరిశీలకులు వావివాల సరళాదేవి, పాకలపాటి గాంధీ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేశారు. ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయ ఆవరణలో అంబాజీపేట మండల ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా గుడాల ఫణి ఏకగ్రీవమయ్యారు. అయితే అధ్యక్ష పదవి కోసం గణపతి నాగసత్యనారాయణ (బాబులు), పబ్బినీడి రాంబాబు పోటీ పడ్డారు. అధ్యక్ష పదవిని తమ నాయకుడికే ఇవ్వాలని ఇరు వర్గాలవారు వేదిక వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఇద్దరి పేర్లను పార్టీ అధిష్టానానికి పంపుతామని ఎమ్మెల్యే పులపర్తి, పార్టీ పరిశీలకులు చెప్పడంతో ఆందోళనను విరమించారు. సోమవారం జరిగిన అయినవిల్లి మండల ఎన్నికల్లో కూడా తమ్ముళ్లు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో గలాటా జరిగిన విషయం విదితమే. అంబాజీపేట ఎంపీపీ డీవీవీ సత్యనారాయణ, జెడ్‌పీటీసీ బొంతు పెదబాబు, ఏఎంసీ చైర్మన్ అరిగెల బలరామ్మూర్తి, గణపతి రాఘవులు, కాండ్రేగుల గోపాలకృష్ణ, నేదునూరి వెంకటరమణ, దువ్వూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement