‘దేశం’లో కుర్చీలాట
‘దేశం’లో కుర్చీలాట
Published Mon, May 15 2017 11:20 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
- జెడ్పీ పీఠంపై వీడని ఉత్కంఠ
- సమన్వయ సమావేశంలో తేలని రచ్చ
- మధ్యలో వచ్చే వారికి పదవులిస్తే ఎలా అంటున్న నామన వర్గం
- పట్టు సడలించని జ్యోతుల వర్గం
- నేడు సీఎం సమక్షంలో భేటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో రెండు పీఠాలు చిచ్చురేపుతున్నాయి. ఒకటి ఏడాదికిపైనే ఖాళీగా ఉంటే మరొకటి కావాలని ఖాళీ చేస్తున్నారు. ఈ రెండు పీఠాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో నేతలు రెంగు గ్రూపులు కడుతున్నారు. ‘కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్న’ సామెత మాదిరిగా నేతల తీరు ఉండటంతో భర్తీ ప్రక్రియను ఏకాభిప్రాయంతో ముగింపు పలకలేక చేతులెత్తేశారు. పర్వత చిట్టిబాబు ఆకస్మిక మరణం తరువాత నుంచి పార్టీ జిల్లా అ«ధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. ఈ పీఠం భర్తీ చేయాలని పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలో జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు నమ్మి ఓటేసిన జనాన్ని గాలికొదిలేసి టీడీపీ గూటికి చేరడం, బాబు ఇచ్చిన హామీ కేబినెట్‌లో నెహ్రూకు చుక్కెదురవడం తెలిసిందే. నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తనయుడు, జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కు చైర్మన్ ఇస్తారనే ప్రచారం అప్పటి నుంచి నడుస్తున్నదే. నవీన్‌ను చైర్మన్‌ను చేయాలంటే ఇప్పుడున్న చైర్మన్ నామన రాంబాబుకు ఉద్వాసన పలకాల్సిందే. నామనను చైర్మన్‌గా తప్పించి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని గత కొంతకాలంగా పార్టీలో ఆలోచన చేస్తున్నారు.
జతకలని మనసులు....
ఇదే విషయమై రెండు రోజుల కిందట కాకినాడలో జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో సైతం చర్చించినా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగించేశారు. వివాదరహితుడిగా పేరున్న నామనను జ్యోతుల కోసం తప్పించడం సహేతుకం కాదని జ్యోతుల వైరివర్గం బలమైన వాదన వినిపిస్తోంది. మొదటి నుంచీ పార్టీలో ఉన్నా ఇటీవలే తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ కేడర్‌కు ఏమని సంకేతాలు పంపిస్తారని పలువురు అంతర్గత సంభాషణల్లో సీనయర్ల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పుడు తప్పిస్తే తానేదో తప్పు చేసినట్టు, సమర్థంగా పనిచేయలేకపోయానని జనం ముద్రవేస్తారని మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వద్ద ఇటీవల నామన గోడు వెళ్లబోసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. మంత్రి పదవి దక్కని జ్యోతులకు టీటీడీ లేదా, కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తేల్చిచెప్పడం తెలిసిందే. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ కోసం అభ్యర్థించిన సందర్భంలో బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాబు ప్రకటనతో నెహ్రూకు వస్తాదనుకున్న ఆ ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది. ఇటువంటి తరుణంలో రాజకీయ వారసుడిగా నవీన్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా పార్టీలో ఒక స్థాయి కల్పించాలని నెహ్రూతోపాటు అతని వర్గీయులకు బలమైన కోరిక లేకపోలేదు. అందునా మెట్ట ప్రాంతంలో రాజకీయంగా తన తరువాత చక్రం తిప్పే నేతగా పైకి తీసుకురావాలని ఏ తండ్రికి మాత్రం ఉండదు. కానీ చిక్కల్లా ఆది నుంచి రాజకీయంగా వైరం కలిగిన మంత్రి యనమల వర్గీయులు అంతర్గతంగా ఇందుకు అడ్డుచక్రం వేస్తున్నారనే సమాచారమే జ్యోతుల వర్గంలో గుబులు రేపుతోంది. నెహ్రూకు ఎలాగూ నామినేటెడ్ అవకాశం లేదని తేలిపోవడంతో నవీన్‌కు జెడ్పీ చైర్మన్ ఇచ్చి, నామనకు నామినేటెడ్ పోస్టు ఇవ్వాలనే ప్రతిపాదన ఆది నుంచి ఉన్నదే. తన చైర్మన్ పీఠం అలానే ఉంచి ఆ నామినేటెడ్ పోస్టు ఏదో నవీన్‌కే ఇస్తే ఎవరికీ ఇబ్బంది కలగదని నామన పార్టీ సీనియర్ల ముందు చెప్పుకున్నారని, వారు కూడా ఇందుకు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.
పీఠం కాపాడుకునే ప్రయత్నంలో నామన...
తాజా పరిణామాల నేపథ్యంలో నామన తన పీఠాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత బాలయోగి, యనమలతో కలిసి ఉన్న పరిచయాలను ఈ సందర్భగా ఆయన వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. నెహ్రూ అంటే పడని వర్గం ఎక్కడా బయటపడకుండా తెరవెనుక నామనకు మద్ధతు పలుకుతున్నారని సమాచారం. మరోపక్క జిల్లా పగ్గాల కోసం ఎప్పటి నుంచో రేసులో ఉన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరరావు తన ప్రయత్నాల్లో తానున్నారు. పార్టీ పరంగా సీనియరే అయినా, పార్టీ వీడి బయటకు వెళ్లి తిరిగి రావడం బండారుకు మైనస్ అంటున్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జిల్లా అంతటా పార్టీని ఎలా సమన్వయపరుస్తారనేది కూడా చర్చకు దారితీస్తోంది. బండారును కోనసీమ నుంచి మంత్రి చినరాజప్ప వర్గీయులు వ్యతిరేకిస్తున్నారంటున్నారు. అలా అనుకుంటే బండారు కంటే నియోజకవర్గ బాధ్యతలు లేని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, జగ్గంపేట నుంచి పోటీచేసి రెండుసార్లు కోట్ల రూపాయలు తగలేసుకుని ఓడిపోయిన జ్యోతుల చంటిబాబు, కోనసీమ నుంచి మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు తనయుడు రమణబాబు పేర్లు విషయంలో కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలన్నింటిపైనా వీలునుబట్టి మంత్రులు యనమల, నిమ్మకాయల, శాసనమండలి డిప్యుటీ చైర్మన్ ఆర్‌ఎస్ తదితరులు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఆ సమయానికి జెడ్పీ చైర్మన్ నామనను కూడా అక్కడకు రావాలని పిలుపు వచ్చింది. ఆ భేటీ తరువాత జెడ్పీ చైర్మన్, జిల్లా పగ్గాలు విషయంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Advertisement
Advertisement