ప్రతీకాత్మక చిత్రం
టీడీపీ – బీజేపీ మధ్య అంతర్యుధ్ధం
నిన్నటి వరకు మిత్రులు నేడు బద్ధశత్రువులై కాలు దువ్వుతున్నారు. కమలనాథులతో వైరి అనంతరం ఇప్పటికే ‘టీ’ కప్పులో తుపాను మొదలు కాగా, దీన్ని అవకాశంగా చేసుకుని టీడీపీపై కత్తులు దూసేందుకు బీజేపీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఖర్చులు వగైరాతో పాటు కేంద్రం డబ్బుతో టీడీపీ చేపట్టిన పథకాలపై ఆరా, రాజధాని నిర్మాణ పరిశీలనకు ప్రణాళిక రచిస్తున్నారు. మొత్తానికి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్ అనంతరం మిత్రపక్షాల మధ్య అంతర్యుద్ధం ముదురు పాకాన పడింది.
సాక్షి, విజయవాడ: టీడీపీపై బీజేపీ అంతర్యుద్ధం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా మిత్రధర్మాన్ని పాటించి ఇంతకాలం మౌనంగా ఉన్న కమలనాథులు ఇకపై పూర్తిస్థాయిలో కత్తులు దూయనున్నా రు. టీడీపీ ఎంపీలు కేంద్రంపై చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు త్వరలో గ్రామస్థాయి నుంచి పర్యటనలు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు తమ గుప్పెట్లో ఉంచిన టీడీపీ అవినీతిని ఇకపై బయటపెడతామని ఓ బీజేపీ నాయకుడు బహిరంగంగానే ప్రకటించడం ఇందుకు ఊత మిస్తోంది.
బీజేపీ అస్త్రాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన నిధులపై బీజేపీ శ్రేణులు దృష్టిసారిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నగరానికి చెందిన కొంతమంది నేతలు ఒక టీమ్‌గా ఏర్పడి సమాచారం సేకరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం విజయవాడ నగరంలోనే 28వేల ఇళ్లు మంజూరుచేసింది. వీటిలో ఇప్పటికే జక్కంపూడిలో 10,624 ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
- విజయవాడకు మురుగునీటి కాల్వల అభివృద్ధికి కేంద్రం రూ.461 కోట్లు మంజూరుచేసింది.
- కనకదుర్గా ఫ్లై ఓవర్, విజయవాడ–మచిలీపట్నం రోడ్డు విస్తరణ, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌కు వందల కోట్లు అందాయి.
- రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు వచ్చాయి.
- గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి, కార్మికుల బీమా సౌకర్యం, మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, ఇంటింటికీ మరుగుదొడ్లు వంటి అనేక పథకాలకు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరుచేస్తూనే ఉంది.
అయితే వీటికి చంద్రన్న బీమా పథకం, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ వంటి తమ పార్టీ పేర్లు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందనే ఆగ్రహం బీజేపీ నేతల్లో ఉంది. ఆయా పథకాల వద్ద కనీసం బీజేపీ జెండాలు కానీ, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలు కానీ పెట్టకపోవడాన్ని ఇక నుంచి నిలదీయాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో తమను ఎందుకు భాగస్వాములను చేయడం లేదో ప్రశ్నించనున్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి నివేదికలు తయారుచేసి ఆయా మండలాల నిర్వాహకులకు పంపించే ఏర్పాటు బీజేపీ నేతలు చేపట్టారు.
నైతిక విలువలు బయటపెట్టాలి
చంద్రబాబు నైతిక విలువలను పక్కనపెట్టి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడం, అందులో ఒకరికి వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడానికి ప్రయత్నించడం వంటి అంశాలపై బీజేపీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. చంద్రబాబు వెన్నుపోటు, నైతిక విలువలులేని రాజకీయాలపై ప్రశ్నించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పెరిగిన అవినీతి, రాజధానిలో కోట్ల విలువైన భూములను ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో కొన్న అంశాలను ఆధారాలతో సహా సేకరించి ప్రజలకు వివరించనున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఒకసారి, హోదా సంజీవని కాదంటూ మరోసారి ప్రజలు, కేంద్రాన్ని పక్కదారి పట్టించిన చంద్రబాబు నైజాన్ని బయట పెట్టనున్నారు.
ఏం సాధించాం?
రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ శ్రేణులకు ఎంత అన్యాయం చేసినా మిత్రధర్మాన్ని పాటించి మౌనంగా ఉన్నారు. నాలుగేళ్లలో ఒక చైర్మన్ పదవి కూడా బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ దక్కించుకోలేకపోయారు. తమ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులే కాదు, జన్మభూమి కమిటీల్లోనూ స్థానం సంపాదించలేదు. కనీసం తెల్లకార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇప్పించుకోలేకపోయామనే భావన కమలనాథుల్లో కనిపిస్తోంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాల్లో తమ కార్యకర్తలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీయడమే కాదు, పథకాల్లో జరుగుతున్న అవినీతిని ప్రజలకు వివరించాలని ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో కొంతమంది నేతలు డిమాండ్ చేసిన విషయం విదితమే.
త్వరలో రాజధాని నిర్మాణాల పరిశీలన
ప్రపంచస్థాయి రాజధాని అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ తాత్కాలిక భవనాల నిర్మాణం చేపట్టారు. వీటిని బీజేపీ నేతలు త్వరలో పరిశీలించాలని భావిస్తున్నారు. దీనిపై సమగ్రమైన నివేదిక కేంద్రప్రభుత్వానికి పంపడమే కాకుండా భవనాల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని రాజధానిలోని ప్రతి గ్రామాల్లోనూ త్వరలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment