దొందూ దొందే..!
అభివృద్ధి పేరుతో ఎవరెంత కమీషన్లు తీసుకుంది ఒక్కో విషయం బయటకు వస్తోంది. అక్కడ జరుగుతున్న పనుల్లో కూడా నాణ్యత లేదని ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇరువర్గాలు ఎవరికివారు తక్కువ తినలేదని, అభివృద్ది పేరుతో అవినీతికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. గృహనిర్మాణ లబ్ధిదారుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతికి పాల్పడినట్లు బీజేపీ నాయకులు ఆరోపిస్తుంటే, మంత్రి అన్ని పనుల్లో కమీషన్లు తీసుకుంటున్నట్లు తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్లుగా ఇరువర్గాల మధ్య ఇదే పరిస్థితి ఉన్నా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బదిలీతో మరోసారి రచ్చకెక్కారు. 15వ వార్డులో కౌన్సిలర్‌కు తెలియకుండా మంత్రి అనుచరులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి ద్వారా ఇళ్ల లబ్ధిదారుల గురించి, మునిసిపల్ అధికారులను వెంటపెట్టుకొని ఆరా తీస్తున్నారని ఆరోపిస్తూ ఆ వార్డు కౌన్సిలర్ రాజీనామాకు సిద్ధం అయ్యారు.
దీనిపై పాలకపక్షం భగ్గుమంది. మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే తేల్చుకుంటామంటూ రెండురోజుల క్రితం తెలుగుదేశం నాయకులు విజయవాడ వెళ్లారు. అక్కడ ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి తమ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లడంతో పుల్లారావుకు ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత అప్పగించారు. మంత్రి మాణిక్యాలరావు మాత్రం మున్సిపాల్టీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద 600 మంది లబ్ధిదారులు ఇంకా మిగిలిపోయారని, వారిని గుర్తించి న్యాయం చేసేందుకు చర్యలు చేపడితే దాన్ని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్దిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించారు.
దీనిపై మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు స్పందించారు. సీబీఐ ఎంక్వైరీ వేస్తే మంత్రి అవినీతి బాగోతాలను తాము బయటపెడతామని ప్రకటించారు. ఒక ఏజెంట్‌ను పెట్టుకుని అతని ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమిత్‌షా పర్యటన సందర్భంగా ఒక రోడ్డు వేయాలని మంత్రి కోరితే తాము అంగీకరించలేదనే కమిషనర్‌ను బదిలీ చేశారని ఆరోపించారు. ఎన్ని కోట్లు తెచ్చావు, ఎంత అభివృద్ధి చేశావో చెప్పాలన్నారు. మెయిన్ రోడ్డులో ఎంత క్వాలీటీ ఉందో చెప్పాలన్నారు.