వీసా బాలాజీపై సీఎన్ఎన్ ప్రత్యేక కథనం
చిలుకూరు బాలాజీ.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో కొలువైన కలియుగదైవం.. వీసా బాలాజీగానూ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. భక్తుల కోరికలు.. ప్రధానంగా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతోన్న చిలుకూరు బాలాజీ ప్రతిష్ట ఇప్పుడు విదేశీ మీడియాను సైతం ఆకట్టుకుంది. తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానెల్.. అమెరికాకు చెందిన కేబుల్ న్యూస్ నెట్ వర్క్ (సీఎన్ఎన్) తన వెబ్ సైట్ లో చిలుకూరు బాలాజీ ఆలయంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
500 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీవేంకటేశ్వరుడి అవతారంలో కొలువైఉన్న విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా అడిగితే ఏదైనా అనుగ్రహిస్తాడని, అమెరికా సహా ఇతర దేశాల వీసా కావాలనుకునేవారు ఆ ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేస్తే దైవానుగ్రహంతో వీసా లభిస్తుందని, కోరిక నెరవేరిన తర్వాత మరో 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం బ్రసెల్స్(బెల్జియం)లో ఉంటోన్న తన సోదరికి కూడా చిలుకూరు బాలాజీ దయవల్లే వీసా లభించిందని మంజునాథ్ సింగ్ అనే భక్తుడు పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ అనుగ్రహంతో ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నవారి సంఖ్య తక్కువేమీకాదని ఆలయ ప్రధాన అర్చకులు ఎస్. రంగరాజన్ సీఎన్ఎన్ కు చెప్పారు. సాంకేతిక విద్యాసంస్థల సంఖ్య పెరగడంతో విదేశాల్లో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లగోరే సంఖ్య కూడా పెరిగిందని, అయితే దేశంలోని మరే ఇతర ఆయలయాలకు రాని విధంగా చిలుకూరు బాలాజీకి 'వీసా బాలాజీ' అని పేరొచ్చిందని రంగరాజన్ చెప్పుకొచ్చారు.