*వారంలో డిజైన్లు మార్చి ఇవ్వాలన్న సీఆర్‌డీఏ
*అవీ బాగా లేకపోతే మరో కంపెనీకి అవకాశం
*20లోపు డిజైన్లపై నిర్ణయం: మంత్రి నారాయణ
*జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు
అమరావతి: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయం డిజైన్లకు సంబంధించి జపాన్ కంపెనీ మకి అసోసియేట్స్‌కు మరో అవకాశం ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వారంలోపు కొత్త డిజైన్లు ఇవ్వాలని కోరింది. ఆ డిజైన్లూ ప్రభుత్వానికి నచ్చని పక్షంలో డిజైన్ల పోటీలో రెండో స్థానంలో నిలిచిన లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ కంపెనీని ఆహ్వానించే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నారు. మలేసియాకు చెందిన హారిస్ ఇంటర్నేషనల్ ఇచ్చిన డిజైన్లతోపాటు దేశంలోని సీపీ ఖురేజా అసోసియేట్స్, హపీజ్ కాంట్రాక్టర్ డిజైన్లను కూడా పరిశీలించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ భవన సముదాయంలోని హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియెట్ తదితర భవనాల డిజైన్ల కోసం నిర్వహించిన పోటీలో మకి ఎంపికైన విషయం తెలిసిందే.
అయితే ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రత్యామ్నాయంగా ఇతర విదేశీ కంపెనీలతోపాటు దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ జపాన్ సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మకిని వదులుకోవడానికి సంశయిస్తోంది. చివరిగా డిజైన్లు మార్చి ఇవ్వాలని ఇటీవల సీఆర్‌డీఏ మకికి తెలిపింది. మూడు, నాలుగు రోజుల్లో మకి మార్చిన డిజైన్లను సీఆర్‌డీఏకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20లోపు డిజైన్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెబుతున్నారు.
వచ్చే వారం నుంచి వెలగపూడి నుంచే పాలన
కాగా, వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన మంత్రి నారాయణ.. వచ్చే జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ చివరినాటికి డిజైన్లు పూర్తవుతాయన్నారు. వచ్చే వారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. సచివాలయం పరిధిలోని 49 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు.
వచ్చే శుక్రవారం నుంచి ఎనిమిది గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నేలపాడు రైతులు కొందరు రోడ్ల సౌకర్యాలు లేవని అడిగారని, త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం 4,600 నివాస గృహాలు తొలగించాల్సి ఉందని, అయితే ప్లాన్‌లో కొంత మార్పులు చేయటంతో 350 ఇళ్లకు కుదించినట్లు తెలియజేశారు. వారికి సీఆర్‌డీఏ ప్యాకేజీ తయారు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన కార్యక్రమం రద్దయినట్లు తెలిపారు.