
ఎంపీలూ.. చీరలు కట్టుకోండి!
అనంతపురం సిటీ: ప్రత్యేక హోదా విషయంలో చేతగాని మాటలు మాట్లాడుతున్న ఎంపీలు చీరలు కట్టుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం విద్యార్థి, యువజన నాయకులు, కార్యకర్తలు స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ తీసుకుని ర్యాలీగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడే బైఠాయించి ప్రత్యేక హోదా సాధించడం చేతగాని ఎంపీలు దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప చీరలు కట్టుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.వై.ప్రసాద్, బి.రమణ మాట్లాడుతూ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. భవిష్యత్‌లో వీరు ఎక్కడ తిరిగినా కోడిగుడ్లు, టమాటాలతో స్వాగతం పలుకుతామన్నారు.
ఎంతసేపు గడిచినా ఎవరూ రాకపోవడంతో చీర, గాజులు, పసువు కుంకుమ ఇంట్లో పెట్టి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.జాన్సన్‌బాబు, నరేష్, నగర కార్యదర్శి మనోహర్, కుళ్లాయప్ప, గాదిలింగ, చాంద్‌బాషా, రాఘవ, మోహన్, రియాజ్ పాల్గొన్నారు.