విడిపోతున్న అంగన్‌వాడీ | anganwadi divided to icds? | Sakshi
Sakshi News home page

విడిపోతున్న అంగన్‌వాడీ

Published Sat, Sep 9 2017 11:00 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

విడిపోతున్న అంగన్‌వాడీ - Sakshi

విడిపోతున్న అంగన్‌వాడీ

- ఐసీడీఎస్‌ విభజనకు రంగం సిద్ధం
- ఒక్కో ప్రాజెక్టు పరిధిలో 250 అంగన్‌వాడీ కేంద్రాలు
-  ప్రస్తుతం జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు
- కొత్తగా మరో 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కసరత్తు
- ప్రతిపాదనలు పంపిన ఐసీడీఎస్‌ జిల్లా అధికారులు


మడకశిర: జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు రెండుగా విడిపోనున్నాయి. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల విభజనకు ఆశాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల విభజన ప్రతిపాదనలను జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.  పాలనాసౌలభ్యం కోసం ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను విభజిస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. మడకశిర, కదిరి ఈస్ట్, వెస్ట్, పెనుకొండ, హిందూపురం, గుత్తి, కంబదూరు, కూడేరు, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కణేకల్లు తదితర ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధానంగా మడకశిర ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 438 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. హిందూపురం ప్రాజెక్టు పరిధిలో 500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కదిరి ఈస్ట్‌ ప్రాజెక్టు పరిధిలో 500, వెస్ట్‌ పరిధిలో 500పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా పెనుకొండ ప్రాజెక్టు పరిధిలో 500 పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. గుత్తి, కూడేరు, తాడిపత్రి, ఉరవకొండ తదితర ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో కూడా 300కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏ ప్రాజెక్టు పరిధిలో 250 కన్నా ఎక్కువగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రాజెక్టులను విభజించనున్నట్లు సమాచారం.

పథకాల అమలు పటిష్టం చేసేందుకే.. :
ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల అమలును మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల విభజనకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 250కి పైగా అంగన్‌వాడీ  కేంద్రాలు ఉన్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను విభజించడానికి వీలుగా జిల్లా అధికారులు రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కొత్తగా జిల్లాలో మరో 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను చేయనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. మడకశిర ప్రాజెక్టు పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో 2 మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఒక ప్రాజెక్టు పరిధిలోకి, మిగిలిన అంగన్‌వాడీ కేంద్రాలను మరో ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడానికి నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల విభజనపై సమాచారం ఇచ్చిన ఆర్జేడీ:
ఐసీడీఎస్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శారద  మడకశిర నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక ఐసీడీఎస్‌ అధికారులకు ప్రాజెక్టుల విభజనపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మడకశిర ఐసీడీఎస్‌ ప్రాజెక్టును కూడా విభజించనున్నట్లు ఆమె తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు కూడా ఆమె తెలిపినట్లు  సమాచారం.

ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమే
జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల విభజనకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమే. 250 అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక ఐసీడీఎస్‌ ప్రాజెక్టును చేయనున్నారు. మడకశిర ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కూడా విభజన కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులకు తాము కూడా పంపాం. త్వరలోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది.
 – ఇందిరాదేవి, సీడీపీఓ, మడకశిర 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement