
చిన్నారులపై నిర్లక్ష్యం
► అంగన్‌వాడీలకు ఆగిన పాల సరఫరా
► ఒకటిన్నర నెల నుంచి ఎదురుచూపులు
► ఇబ్బందుల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు
► విషయం తెలీదన్న మంత్రి పీతల సుజాత
మడకశిర : జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకటిన్నర నెల నుంచి పాలు సరఫరా కావడం లేదు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. సంబంధిత ఉన్నతాధికారులు కూడా ఈవిషయాన్ని పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, బరువు తక్కువ ఉన్న పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రోజూ పాలను అందించాలి.తద్వారా వీరిలో పౌష్టికాహార లోపం రాకుండా చూడాలి. ఇది మంచి ఉద్దేశ్యమైనా అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.క్రమం తప్పకుండా పాలను అందించకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ల పరిధిలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, కంబదూరు, కళ్యాణదుర్గం, కనేకల్లు, రాయదుర్గం, సీకేపల్లి, అనంతపురం అర్బన్, కూడేరు, తాడిపత్రి, గుత్తి, శింగనమల, ధర్మవరంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు పని చేస్తున్నాయి. ఈ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని గర్భిణులు,బాలింతలు,బరువు తక్కువ ఉన్న పిల్లలకు రోజూ పాలను అందించాలి. గర్భిణులు, బాలింతలకు రోజూ 200 మి.లీ పాలను ఇవ్వాలి. బరువు తక్కువ ఉన్న పిల్లలకు రోజూ 100 మి.లీ పాలను అందించాలి. అయితే ఒకటిన్నర నెల నుంచి పాలు అందడం లేదని వారు వాపోతున్నారు. ఎప్పటి నుంచి పాలను సరఫరా చేస్తారో కూడా ఐసీడీఎస్ అధికారులు చెప్పడంలేదని గర్భిణులు, బాలింతలు ఆవేదన చెందుతున్నారు. టెట్రా పాకెట్ల ద్వారా పాలను అంగన్‌వాడీ కేంద్రాలకు ఇన్ని రోజులు సరఫరా చేసే వారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం డిమాండ్ మేరకు పాల పాకెట్లను సరఫరా చేయలేకవడంతో ఈపరిస్థితి ఏర్పడినట్లు ఐసీడీఎస్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
తెలియదన్న మంత్రి పీతల సుజాత
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకటిన్నర నెల నుంచి పాల సరఫరా ఆగిపోయినట్లు తనకు తెలియదని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె గురువారం మడకశిరకు వచ్చిన సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలకు గత ఒకటిన్నర నెల నుంచి పాలు సరఫరా కావడంలేదని విలేకరులు ప్రశ్నించేవరకూ ఈ విషయం తెలియక పోవడం మంత్రి పనితీరును ఏవిధంగా ఉందో తెలియజేస్తోంది.ఆ తర్వాత మంత్రి స్థానిక సీడీపీఓ ఇందిరాదేవిని పిలుపించుకుని పాల సరఫరా ఆగిన విషయంపై ఆరా తీయడం గమనార్హం.
జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి
నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకటిన్నర నెలనుంచి పాలు సరఫరా కావడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో గర్భిణులు, బాలింతలకు పాలను ఇవ్వడంలేదు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి కూడా తీసుకెళ్లాం.మడకశిరకు వచ్చిన మంత్రి పీతల సుజాతకు కూడా పాల సరఫరా ఆగిపోయిన విషయాన్ని తెలిపాం.అంగన్‌వాడీ కేంద్రాలకు పాలను ఎప్పటినుంచి సరఫరా చేస్తారో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. – ఇందిరాదేవి, సీడీపీఓ, మడకశిర