(ఫైల్) ఫోటో
ఏ ప్రభుత్వానికైనా అంగన్‌వాడీలంటే చిన్న చూపు. వారితో బండెడు చాకిరీ చేయించుకుంటారేగానీ సమస్యలు మాత్రం పరిష్కరించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అంగన్‌వాడీల సేవలను వినియోగించుకోవడంలో మాత్రం పాలకులు ముందుంటారు. అంగన్‌వాడీలు, ఆయాలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉండేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడ వేసింది. తమ పార్టీకి అనుబంధంగా తెలుగునాడు అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్‌ను స్థాపించింది. తక్షణమే అందులో సభ్యత్వం తీసుకోమని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఆయాలను సభ్యత లేకుండా బెదిరిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలు, అక్రమాలకు నిలయమైన కందుకూరు నియోజకవర్గమే అందుకు వేదికైంది.
ఉలవపాడు: రాష్ర్టంలో అనాగరిక పాలన నడుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకూ అందరికీ ఇబ్బందులే. తెలుగు తమ్ముళ్లు చివరకు చిరుద్యోగులను కూడా వదలడం లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలపై కూడా తమ ప్రతాపం చూపుతున్నారు. కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీలో వారు ఎలాగూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు అంగన్‌వాడీలు, ఆయాలు ఏ యూనియన్‌లో ఉండాలో కూడా టీడీపీ నేతలే నిర్దేశిస్తున్నారు. కార్యకర్తలపై తమ పెత్తనం కొనసాగించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుంచి వారిని దూరం చేసేందుకు ఇటీవల తెలుగుదేశం పార్టీ తెలుగునాడు అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్‌ను స్థాపించింది. అందులో సభ్యత్వం తీసుకోండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవని ఎక్కడికక్కడ ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు అంగన్‌వాడీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నిత్యం తనిఖీలు చేయిస్తామని.. రాజకీయంగా ఇబ్బందులు పెట్టి ఉద్యోగాలు పీకేస్తామని.. ఆ తర్వాత తమకు నచ్చినవారిని నియమించుకుంటాం.. అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారు.
‘కందుకూరు’లో బరితెగించిన తమ్ముళ్లు
కందుకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను వారం రోజుల నుంచి వెంటపడి మరీ వేధిస్తున్నారు. ఉదాహరణకు ఉలవపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇందులో మూడు మండలాలు కందుకూరు నియోజకవర్గం పరిధిలో, రెండు మండలాలు కొండపి నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 390 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా చాలాకాలం నుంచి సీఐటీయూ అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్‌లో సభ్యులుగా ఉంటున్నారు. కొంతకాలంగా వీరు వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరందరూ ఐక్యంగా ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని విభజించి పాలించాలన్న ఉద్దేశాన్ని ప్రభుత్వం మనసులో ఉంచుకుంది. అందులో భాగంగా తమ కార్యచరణను ముందుకు తీసుకెళ్తోంది.
వంద ఇస్తారా.. ఎమ్మెల్యేకు చెప్పమంటారా?
తెలుగునాడు అంగన్‌వాడీ వర్కర్‌స యూనియన్‌లో సభ్యత్వం తీసుకునేందుకు వంద రూపాయలు ఇస్తారా.. లేదా కొండపి ఎమ్మెల్యేకు, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శివరాంకు చెప్పి ఉద్యోగాలు ఊడబీకమంటారా.. అని చోటా టీడీపీ నేతలు కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. శుక్రవారం ఉలవపాడులోని ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఇంటికి వెళ్లిన టీడీపీ నాయకులు సభ్యతం రాయమని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. లేకుంటే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. చేసేది లేక సదరు కార్యకర్త తమ యూనియన్ బాధ్యులకు ఫోన్ చేసి వాపోయింది. తమ యూనియన్ పెద్దలతో మాట్లాడి చెబుతానని కార్యకర్త తిరిగి సమాధానం ఇవ్వడంతో సదరు నేతలు మండిపడ్డారు. సభ్యత్వం తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించి మరీ వెళ్లారు.
తలలు పట్టుకుంటున్న కార్యకర్తలు
టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ఇప్పుడేం చేయాలంటూ ఒకరితో ఒకరు తమ బాధలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం మండలాలు, కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు హడలిపోతున్నారు. ఉద్యోగ పరంగా టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెడతారోనని ఆందోళన చెందుతున్నారు. నచ్చిన యూ నియన్‌లో సభ్యత్వం తీసుకుంటాం గానీ.. ఇలా బెదిరించి యూ నియన్‌లో చేర్చుకోవడం సభ్యత కాదని పేర్కొంటున్నారు. సీఐటీయూ యూని యన్, టీడీపీ అనుబంధ యూనియన్‌ల వివాదం ఎటు దారి తీస్తుందోనని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలను టీడీపీ నేతలు బెదిరించడం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికుల మధ్య ఐక్యతను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. యూనియన్లలో లేని కార్మికులు చాలా మంది ఉన్నారు. వారిని తెలుగునాడు అంగన్‌వాడీ కార్మికుల యూనియన్లో చేర్చుకుంటే మాకు అభ్యంతరం లేదు. కార్మికుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలను అడ్డు పెట్టుకుని కార్మికులను ఉద్దేశ పూర్వకంగా వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలపై టీడీపీ నేతలు వేధిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలో ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
- చీకటి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ