ఢిల్లీ ప్రదర్శనలో కదం తొక్కాలి
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయడంతోపాటు రిటైర్మెంట్ ప్రయోజనాలను కల్పించాలని అంగన్‌వాడీ, సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టడంతోపాటు కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేలా ఫిబ్రవరి 15న ఢిల్లీలో భారీ ప్రదర్శనకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమాఖ్య జాతీయ 8వ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారమిక్కడి ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ జరిగింది. ఈ సభకు అంగన్‌వాడీలు వేలాదిగా తరలి వచ్చారు.
అంతకుముందు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సభలో సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, పేదల కడుపులు కొట్టి బడావ్యక్తులకు మేలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఐసీడీఎస్‌కు నిధులు తగ్గించి దాదాపు 8 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందకుండా చేసిందని ఆరోపించారు. కేంద్రం అంబానీ, అదానీల వైపు ఉంటుందో అంగన్‌వాడీల వైపు ఉంటుందో తేల్చుకోవాలన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ, అంగన్‌వాడీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో గడుపుతూ కార్మికుల సమస్యలను విస్మరిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలను రూ. 20 వేలకు, హెల్పర్లకు రూ. 15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ సర్కారు టీడీపీ, కాంగ్రెస్ వారికి గులాబీ జెండాలు కప్పితే బంగారు తెలంగాణ రాదని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, అంగన్‌వాడీ, ఆశా వ ర్కర్లను రెగ్యులర్ చేస్తేనే బంగారు తెలంగాణ అవుతుందన్నారు.
సమాఖ్య ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే కుట్రను తిప్పికొట్టాలన్నారు. బడ్జెట్‌లో అంగన్‌వాడీకి నిధులను సగానికి తగ్గించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ అధ్యక్షురాలు నల్లా భారతి అధ్యక్షత వహించిన ఈ సభలో సీఐ టీయూ తెలంగాణ అధ్యక్షులు చుక్కా రాములు, జాతీయ కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్, అఖిల భారత అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు ఉషారాణి, శ్రామిక మహిళా సమాఖ్య నాయకురాలు రమ తదితరులు మాట్లాడారు.