ట్రిపుల్ ఐటీకి మరో 30 ఎకరాల భూములు
కర్నూలు(అగ్రికల్చర్):
కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో 151 ఎకరాల్లో చేపట్టిన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణ పనులను మంగళవారం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు. ఇంజనీర్లతో పనుల తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ట్రిపల్ ఐటీకి అదనంగా మరో 30 ఎకరాల భూమిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ కర్నూలు తహసీల్దారును ఆదేశించారు. భవనానికి దక్షిణం వైపున్న 30 ఎకరాల భూమి ట్రిపుల్ ఐటీకి అనువుగా ఉంటుందని, దీనిని కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అవసరమైనమైన పనులపై వెంటనే దృష్టి సారించాలన్నారు. తరగతి గదులు, ప్రయోగశాల, పరిపాలన భవనాలు పూర్తి చేసి 100 బాలికలకు, 150 మంది బాలురకు ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 11 అంతస్తుల్లో భవనాల పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జేసీ వెంట కర్నూలు తహసీల్దారు రమేష్‌బాబు, ట్రిపుల్ ఐటీ ఇంజనీర్లు, వీఆర్‌ఓ రంగనాథ్ తదితరులు ఉన్నారు.