రాయలసీమకు మరో అన్యాయం | another injustice to rayalaseema | Sakshi
Sakshi News home page

రాయలసీమకు మరో అన్యాయం

Published Mon, Jun 12 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

రాయలసీమకు మరో అన్యాయం

రాయలసీమకు మరో అన్యాయం

– సొరంగం గుండా 5వేల క్యూసెక్కుల నీటికే పరిమితం
– ఫాల్ట్‌జోన్‌ పేరుతో  కుదింపు
– అటవీశాఖ అనుమతి ఇవ్వడం లేదని అవుకు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపు  
– వైఎస్‌ఆర్‌ ఆశయానికి తూట్లు
-    కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు ప్రశ్నార్థకం
 
 రాయలసీమ జిల్లాలను చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధానితో పాటు ప్రతి విషయంలో  ఈ ప్రాంతాని​‍్న విస్మరిస్తూ వస్తోంది. తాజాగా అవుకు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం తగ్గించడంతో పాటు ఫాల్ట్‌జోన్‌ పేరుతో  సొరంగం మార్గాల్లో  నీటి సరఫరాను కుదించారు. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను తరలించి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది.
 
కోవెలకుంట్ల: లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయం. అందులో భాగంగా జలయజ్ఞం పథకం కింద  2005వ సంవత్సరంలో రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ. 70కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. కర్నూలు, కడప జిల్లాల్లో 77200 ఎకరాలకు సాగునీరు, జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద కాల్వ ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ.  790కోట్లు కేటాయించారు.
 
శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401కోట్లతో 12కి లోమీటర్ల మేర సొరంగమార్గాలను  ఏర్పాటు చేసి ఒక్కొక్క సొరంగం గుండా శ్రీశైలం జలాశయం నుంచి  20వేల క్యూసెక్కుల వరద జలాలను  రిజర్వాయర్‌లో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010 నాటికే ఒక సొరంగం గుండా 10వేల క్యూసెక్కుల నీరు వైఎస్‌ఆర్‌ జిల్లా గండికోటకు  విడుదల చేయాల్సి ఉంది. అయితే, 2009లో వైఎస్‌ఆర్‌ అకాల మరణం,  తర్వాత కిరణ్‌ సర్కార్,  2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 
 
 
సొరంగం గుండా 5 వేల క్యూసెక్కుల నీటికే పరిమితం 
శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను గాలేరు నగరి కాల్వ ద్వారా మళ్లించి కర్నూలు జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు, కడప జిల్లాలోని గండికోట, మైలవరం రిజర్వాయర్లను నింపాల్సి ఉంది. అవుకు మండలంలోని మెట్టుపల్లె సమీపంలో ఎర్రమల కొండలు కాల్వ నిర్మాణానికి అడ్డుగా ఉండటంతో  ఆ ప్రాంతాల్లో  ఒక్కో సొరంగం ఆరు కిమీ చొప్పున రెండు సొరంగాలను నిర్మించారు. ఒక్కో సొరంగం గుండా పదివేల క్యూసెక్కుల నీరు అవుకు రిజర్వాయర్‌లో చేరాల్సి ఉంది. ఇదే మండలం రామాపురం సమీపంలోని గాలేరు నగరికాల్వ ద్వారా రిజర్వాయర్‌ నీటిని కడప జిల్లా గండికోట, మైలవరం రిజర్వాయర్లకు విడుదల చేయాలి. సొరంగ మార్గాల్లో ఫాల్ట్‌జోన్‌ పేరుతో నీటి సరఫరాను కుదించినట్లు తెలిసింది.
 
ఫాల్ట్‌జోన్‌లో కొండ ప్రాంతం ఉల్లి పడుతుందన్న సాకుతో రెండు సొరంగ మార్గాలను  పూర్తి చేయకుండా కొన్ని చోట్ల ఒక సొరంగం నుంచి మరొక సొరంగంలోకి డైవర్షన్‌ ఏర్పాటు చేశారు. సొరంగాల్లో సుమారు 500  మీటర్ల మేర ఫాల్ట్‌జోన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  రెండు సొరంగ మార్గాల గుండా 20వేల క్యూసెక్కుల నీరు వెళ్లాల్సి ఉండగా ఫాల్ట్‌జోన్, డైవర్షన్‌ కారణాలు చూపుతూ 5వేల క్యూసెక్కులకు తగ్గించడంతో  15వేల క్యూసెక్కుల నీటి సరఫరా ఆగిపోనుంది.
 
అవుకు రిజర్వాయర్‌ 2 టీఎంసీల నీటికే పరిమితం
అవుకు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాక 4.15 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలి. అటవీశాఖ అనుమతి పేరుతో రిజర్వాయర్‌ను రెండు టీఎంసీల నీటికే పరిమితం చేశారు. 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అటవీ ప్రాంతం మునిగిపోతుందని, ఆ శాఖ అనుమతి ఇవ్వడం లేదని అధికారులు సాకు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్‌ నుంచి గాలేరు నగరి ద్వారా గండికోట, మైలవరం రిజర్వాయర్లు నింపాలి. రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉంచకపోవడం, సొరంగ మార్గాన్ని  5వేల క్యూసెకు​‍్కల నీటికే పరిమితం చేయడంతో మూడు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు ప్రశ్నార్థకమైంది.
 
రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచాలి: కామని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ కో ఆర్డినేటర్, కోవెలకుంట్ల
అవుకు రిజర్వాయర్‌ నీటి నిల​‍్వ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచాలి. ప్రస్తుతం 4.15 టీఎంసీల సామర్థ్యం ఉన్నా రెండు టీఎంసీల నీటి నిల్వకే పరిమితం చేశారు.  గాలేరు నగరి కాల్వ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను ఒకే విడతలో విడుదల చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. సొరంగ మార్గాల గుండా 15వేల క్యూసెక్కుల నీటిని తగ్గించడం విచారకరం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement