టీడీపీకి మరో షాక్! | Another shock to TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి మరో షాక్!

Published Tue, Oct 27 2015 4:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీకి మరో షాక్! - Sakshi

టీడీపీకి మరో షాక్!

♦ గులాబీ గూటికి గుండు సుధారాణి?
♦ నెలాఖరులోగా టీఆర్‌ఎస్‌లో చేరిక
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు అధికార టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను తమ గూటిలో చేర్చుకున్న టీఆర్‌ఎస్.. మరో ముఖ్య నేత చేరికకు రంగం సిద్ధం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వరంగల్‌కు చెంది న టీడీపీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి చేరికకు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీని చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేయొచ్చన్న ఆలోచనలో టీఆర్‌ఎస్ ఉంది. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదంటూ పలువురు నేతలు ఇప్పటికే వలస బాట పట్టారు.

ఇదే జిల్లాకు చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇదివరకే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేస్తున్న సుధారాణికి ఆ పార్టీ నాయకత్వం రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. అయినా రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కొందరితో ఆమె వర్గానికి పొసగడం లేదు. గతంలో ఓ నేతతో బహిరంగ వేదికపైనే ఘర్షణ కూడా చోటు చేసుకుంది.ఆ వివాదం సర్దుకున్నా.. పార్టీలో ఆమె ఇమడలేక పోతున్నారని, సుధారాణి వర్గీయులు కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.

ఈ నెలాఖరులోగా ఆమె గులాబీ గూటికి చేరుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారని సమాచారం. టీఆర్‌ఎస్ నాయకత్వం కూడా ఆమె చేరికకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలోనే కొందరు నాయకుల మధ్యవర్తిత్వంతో ఆమె సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

 టీడీపీ నష్ట నివారణ చర్యలు
 తమ పార్టీకి చెందిన సుధారాణి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని ముందే పసిగట్టిన టీడీపీ నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆమెను పార్టీలోనే కొనసాగించేందుకు రాష్ట్ర నాయకత్వం మంతనాలు కూడా జరిపినట్టు తెలిసింది. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీలో ఆమెకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శ ఉంది. కేవలం ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవితో సరిపెట్టారు. పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుసుకున్న పార్టీ నాయకత్వం... ఆమెకు రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్ష పదవి ఇవ్వజూపుతున్నట్టు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement