వెంకన్న సన్నిధికి ఇంకో రైలు
వెంకన్న సన్నిధికి ఇంకో రైలు
Published Thu, Dec 29 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
నూతన సంవత్సర కానుకగా తిరుమలకు డబుల్ డెక్కర్ ట్రైన్
ఏసీ బోగీల్లో ప్రయాణం
ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో హాల్ట్
తాడేపల్లిగూడెం :
తిరుమలేశుడిని దర్శించుకునే భక్తుల కోసం ప్రధాన రైలు మార్గంలో నూతన సంవత్సర కానుకగా మరో కొత్త రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇక నుంచి డబుల్ డెక్కర్ రైలులో ఏసీ బోగీల్లో తిరుపతి వెళ్లే అవకాశం కలగనుంది. తిరుపతివిశాఖపట్నం మ«ధ్య శుక్రవారం నుంచి డబుల్ ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి 12.10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇదే రైలు 31వ తేదీన అర్ధరాత్రి ఒంటిగంటకు విశాఖ నుంచి బయలుదేరి జనవరి 1న మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రస్తుతానికి తాత్కాలిక నంబర్ కేటాయించారు. తిరుపతి నుంచి విశాఖ బయలుదేరే రైలుకు 02708, విశాఖ నుంచి తిరుపతి బయలుదేరే రైలుకు 02707 నంబరు ఇచ్చారు. జిల్లాలోని ఏలూరు. తాడేపల్లిగూడెం స్టేషన్లలో దీనికి హాల్ట్ కల్పించారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ఈ రైలు వెళుతుంది.
వారానికి మూడుసార్లు
జనవరి ఒకటో తేదీ నుంచి వారానికి మూడుసార్లు తిరుపతి నుంచి విశాఖకు ఆది, బుధ, శుక్ర వారాలలో బయలుదేరుతుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరే ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా 3.50కు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు. తాడేపల్లిగూడెం. రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్టణానికి చేరుకుంటుంది. విశాఖ వైపు వెళ్లే రైలు తాడేపల్లిగూడెం స్టేషన్‌కు ఉదయం 6.30కు వస్తుంది. తిరుపతి వెళ్లడానికి రాత్రి 10.25కు విశాఖ నుంచి బయలుదేరుతుంది. సోమ, గురు, శనివారాలలో తిరుపతి వెళుతుంది. తాడేపల్లిగూడెం స్టేషన్‌కు అర్ధరాత్రి 2.45 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. మరుసటి రోజున ఉదయం 11.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
అన్నీ ఏసీ బోగీలే..
ఈ డబుల్ డెక్కర్ రైలులో మొత్తం 10 బోగీలుంటాయి. అన్నీ ఏసీ బోగీలే. 8 చైర్‌కార్ కోచ్‌లు, రెండు పవర్ కార్ కోచ్‌లు ఉంటాయి. స్లీపర్ సదుపాయం ఉండదు. కూర్చొని మాత్రమే ప్రయాణం చేయాలి. ఏసీ రైలు కావడంతో టికెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. తాడేపల్లిగూడెం నుంచి తిరుపతికి ఈ రైలులో ప్రయాణం చేయాలంటే రూ.700 చెల్లించాలి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో అయితే ఇక్కడి నుంచి స్లీపర్‌లో కోచ్‌లో ప్రయాణించడానికి రూ.350 కాగా, ఈ రైలులో మాత్రం రెట్టింపు చార్జీ వసూలు చేస్తారు.
తిరుగు ప్రయాణానికి మేలు
జిల్లా వాసులకు ఈ రైలు తిరుగు ప్రయాణానికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరి.. మరునాడు ఉదయం 6.30 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుంది., తిరుపతికి వెళ్లిన వారు కొండపైనుంచి కిందకు రావడానికి ఆలస్యమైతే.. తిరుమల ఎక్స్‌ప్రెస్ అప్పటికే బయలుదేరిపోతే ఉంటే ఈ రైలు ఉపయోగపడుతుంది. ఈ రైలు వేగంగా ఉదయానికి తిరుపతి చేరుకునే అవకాశం లేదు. గుంటూరు మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణ సమయం ఎక్కువ. తెల్లారి 11గంటలు దాటాక తిరుపతి వెళుతుంది. భక్తులు ఈ రైలులో వెళ్లి వెంకన్నను దర్శించుకోవాలంటే ఒక రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిఫార్సు లేఖలతో వెళ్లే వారు ఆ లేఖలను దర్శనానికి ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోగా ఎంబీసీ34 లో ఇవ్వాలి. రైలు ఉదయం 11 గంటలు దాటాక తిరుపతి చేరుకుంటే అక్కడి నుంచి బస్సులో తిరుమలకు వెళ్లి లేఖలు ఇవ్వాలంటే కుదరని పని. రైలు ప్రారంభమయ్యాక ఇలాంటి సమస్యలను, రైలు వేళల్లో మార్పులు చేసే అవకాశాలు ఉండొచ్చు
Advertisement