ఏఎన్‌యూ డిగ్రీ పరీక్షల్లో ఇష్టారాజ్యం
* అర్హత, సంబంధంలేని వారికి విధులు అప్పగింత
* కమిటీలతో విచారణలు
* జరుగుతున్నా పట్టించుకోని వైనం
* తొలి రోజు పరీక్షల నిర్వహణపై ఆరోపణలు
ఏఎన్‌యూ : యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో అధికారులు, పరీక్ష విధుల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న వారికి అబ్జర్వర్, స్క్వాడ్ విధులను అప్పగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.‡డిగ్రీ పరీక్షలకు సంబంధించిన అబ్జర్వర్స్, స్క్వాడ్ బృందాల్లో యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అనుభవజ్ఞులైన, అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న వారిని నియమించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో నిబంధనలను తుంగలో తొక్కి అర్హతలేని వారికి కీలక బాధ్యతలు అప్పగించటమే దీనికి నిదర్శనం.
గుంటూరు జిల్లా వినుకొండలో ఓ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి చెందిన వ్యక్తిని నరసరావుపేటలోని ఒక పరీక్షా కేంద్రానికి అబ్జర్వర్‌గా నియమించటం వెనుక యూనివర్సిటీకి సంబంధించిన కొందరు అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇతను ఎక్కడా పాఠాలు చెప్పకపోయినప్పటికీ మైక్రో బయాలజీ లెక్చరర్‌గా చూపి మరీ అబ్జర్వర్ విధులు అప్పగించినట్లు సమాచారం. నరసరావుపేటలోని ఒక డీఈడీ కళాశాలలో పనిచేసే నాన్ టీచింగ్ ఎంప్లాయ్(అధ్యాపకేతర ఉద్యోగి)ని నరసరావుపేటలోని ఒక డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి అబ్జర్వర్‌గా నియమించటం పరీక్షల విధుల అప్పగింతలో అక్రమాలకు నిదర్శనం. డిగ్రీ పరీక్షలకు సంబంధించిన విధుల అప్పగింత వెనుక ముడుపుల వ్యవహారం నడిచిందనే విమర్శలు ఉన్నాయి. దశాబ్దాల తరబడి అర్హతలేని వారిని నియమించటం దీనికి బలం చేకూర్చుతోంది.
తొలి రోజు పరీక్షలపై ఆరోపణల వెల్లువ..
యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల నిర్వహణపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలా కళాశాలల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని పర్యవేక్షణ అధికారుల దృష్టికి వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. దీనిపై వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను కూడా నియమించామని చెప్పారు. ఆరోపణలపై పరీక్షల నిర్వహణ అధికారుతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.